సాగు, తాగు నీటి కోసం రేపు రాస్తారోకో


కడప కార్పొరేషన్ : సాగు, తాగు నీటి కోసం కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన (రేపు) అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గంట పాటు రాస్తారోకో నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగు, తాగు నీటిని ఇప్పుడు పోరాడి సాధించుకోకపోతే భవిష్యత్తులో పోట్లాటలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం వైఎస్‌ఆర్‌సీపీ ఓ అడుగు ముందుకేసి అన్ని పార్టీలను కూడగట్టి ప్రాజెక్టులను పరిశీలించిందన్నారు.

 

 గాలేరు-నగరి, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మూడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పారు. తాజాగా బీజేపీ నేతలు కూడా ప్రాజెక్టులను పరిశీలించి వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలై 12వ తేదీ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి 5న రాస్తారోకోలు నిర్వహించనున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు ఈ ఆందోళనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్ కె. సురేష్‌బాబు మాట్లాడుతూ విభజన హామీలు అమలు పరచాలని కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఫలితంగా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top