ఇదో ‘గుడ్డు’ పుఠాణి

ఇదో ‘గుడ్డు’ పుఠాణి - Sakshi


* పక్కదారి పడుతున్న పౌష్టికాహారం

* పిల్లలు, తల్లుల నోళ్లు కొడుతున్న అక్రమార్కులు

* నెలకు 16 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా 12తో సరి

* కింది నుంచి ఉన్నతస్థాయి వరకూ కుమ్మక్కు


 సాక్షి ప్రతినిధి, కాకినాడ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన గుడ్ల పంపిణీలో గూడు పుఠాణి జరుగుతోంది. వారం వారం ఇవ్వాల్సిన గుడ్లలో కోత పెడుతూ, సొమ్ములు బొక్కుతుంటే.. చర్యలు తీసుకోవలసిన  స్త్రీ శిశుసంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకొంటున్నారు. జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల పంపిణీ జరుగుతోంది. జిల్లాలోని 5,143 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిసి 3,19,436 మంది ఉన్నారు.



వీరిలో ఆరు నెలల నుంచి మూడేళ్ల్ల లోపు చిన్నారులు 1,46,780 మంది, మూడు నుంచి  ఆరేళ్ల లోపు చిన్నారులు 85,935 మంది కాగా గర్భిణులు 86,721 మంది ఉన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 49 లక్షల గుడ్లు సరఫరా చేయాలి. వాటిని అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్‌లు    లబ్ధిదారులకు అందజేస్తుంటారు. గుడ్ల పంపిణీ విషయమై కాకినాడ రూరల్ మండలంలోని స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, తమ్మవరంతో పాటు మురళీధర్‌నగర్ తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘సాక్షి’ ఆరా తీయగా గుడ్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని స్థానికులు చెప్పారు. ఒక్కో కోడిగుడ్డు 50 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి. అయితే కేంద్రాలకు   30 గ్రాముల లోపు ఉండే గుడ్లు కూడా వస్తున్నాయన్నారు.  

 

నాలుగు కాదు.. మూడు విడతలే

ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారులకు (50 నుంచి 60 మంది ఉంటారని అంచనా) వారానికి 200 నుంచి 240 గుడ్లు పంపిణీ చేయాలి. ఒక లబ్ధిదారుకు వారంలో నాలుగు రోజులు (సోమవారం నుంచి గురువారం) నాలుగు గుడ్లు పంపిణీ చేయాలి. ఈ పథకం ప్రారంభమైన మొదట్లో నెలలో 15 రోజులకు ఒకసారి గుడ్లు సరఫరా చేసేవారు.  తర్వాత మారిన విధానం ప్రకారం ఒక అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని 60 మందికి వారానికి నాలుగు వంతున 240 గుడ్లు, నెల మొత్తంలో 960 గుడ్లు పంపిణీ చేయాలి. కానీ అందుకు భిన్నంగా కేవలం మూడు విడతలతోనే సరిపెట్టేస్తున్నారు. ఐసీడీఎస్ సిబ్బంది పై నుంచి క్షేత్రస్థాయి వరకు నిర్వాహకులతో మిలాఖతవడంతోనే ఈ బాగోతం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది.



జిల్లాలోని 5,143 కేంద్రాలలో మూడొంతులు అంటే సుమారు 3,800  కేంద్రాల్లో గుడ్ల సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ కేంద్రాల్లో నెలలో 9 లక్షల పైచిలుకు గుడ్లు దారి మళ్లుతున్నాయి. ఈ అవకతవకలకు తోడు సరఫరా చేసే వారు ఒక వారం రవాణా చార్జీలు కూడా వెనకేసుకుంటున్నారు. గుడ్ల సరఫరా తగ్గింపుపై అంగన్‌వాడీ కార్యకర్తలకు, స్థానికులకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తమపైన ఉన్న పర్యవేక్షకులకు చెబుతున్నా వచ్చిన వాటితో సరిపెట్టుకోండంటున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

గుడ్లు మూడు వారాలే ఇస్తున్నారు..

నెలకు 16 కోడిగుడ్లు ఇస్తారని అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశాల్లో అధికారులు చెబుతున్నా తమకు మూడు వారాలకు 12 గుడ్లు  మాత్రమే ఇస్తున్నారని కాకినాడ రూరల్ మండలం స్వామినగర్‌కు చెందిన కర్రి వెంకటలక్ష్మి వాపోయింది.  పిల్లలకు కూడా అలాగే పెడుతున్నారంది. కొన్నిసార్లు ఇచ్చే గుడ్లు అతిచిన్నవిగా ఉంటున్నాయని నిరసించింది.

 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

గుడ్ల సరఫరాలో అవకతవకలు తమ దృష్టికి కూడా వచ్చాయని, పలు గ్రామాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు చెప్పారు. సక్రమంగా గుడ్లు సరఫరా జరిగేలా చూస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top