అక్రమార్కుల గుండెల్లో గుబులు


అనంతపురం సిటీ : సాంఘిక సంక్షేమ శాఖలో అక్రమాలకు పాల్పడ్డ 13 మంది వార్డెన్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఎలాంటి రాజకీయ, ఆర్థిక ప్రలోభాలకు లొంగకుండా ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ (డీడీ) జీవపుత్రకుమార్ పక్కా నివేదికలను ఉన్నతాధికారులకు అందించడంతో ఆడిట్ నివేదిక రాగానే వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశముందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాలో ఇంటర్, డిగ్రీకి చెందిన 13 వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 711 మంది విద్యార్థులు ఉన్నారు.

 

  సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో 56 రోజుల పాటు కళాశాలలను మూసివేశారు. ఆ సమయంలో ఈ హాస్టళ్లకు చెందిన హానరబుల్ డెరైక్టర్లు (వార్డెన్లు) రూ.14.60 లక్షలను అప్పనంగా డ్రాచేశారు. నో వర్క్.. నో పే అంటూ అప్పటి కలెక్టర్  స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఏ మాత్రమూ జంకు లేకుండా డ్రా చేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో కొందరు వార్డెన్లు హడావుడిగా కొంత సొమ్మును కొందరు విద్యార్థుల ఖాతాలో జమ చేశారు. మరికొందరు డ్రా చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని తిరిగి ఖజానాకు చెల్లించారు. దీనిపై ఏఎస్‌డబ్ల్యూఓను విచారణ అధికారిగా నియమించారు. రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు తలొగ్గిన ఏఎస్‌డబ్ల్యూఓ తూతూ మంత్రంగా నివేదిక సమర్పించారు. ఈ విషయాన్ని డీడీ జీవపుత్రకుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ద్వారా విచారణ జరిపించాలని కమిషనర్‌కు నివేదిక పంపారు. ఆడిట్ ఆఫీసర్ ద్వారా ఆడిటింగ్ చేయించి.. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్‌కు, జాయింట్ డెరైక్టర్‌కు శాఖాపరమైన చర్యల నిమిత్తం నివేదికను పంపనున్నారు. త్వరలో ఆడిటింగ్ పూర్తవనుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 

 నాయకుల వద్దకు పరుగులు

 ఆడిట్ నివేదికను త్వరగా సిద్ధం చేయాలని ఒత్తిడి చేస్తుండడం, ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా డీడీ వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులకు మింగుడు పడటం లేదు. దీంతో జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఓ దళిత నాయకుని సహకారంతో నేరుగా హైదరాబాదులోని సాంఘిక సంక్షేమ శాఖ డెరైక్టర్ కార్యాలయంలోనే పైరవీలు చేసేందుకు సదరు వార్డెన్లు సిద్ధమైనట్లు తెల్సింది. దీన్నంతా తన నెత్తి మీద వేసుకున్న ఓ వార్డెన్.. సదరు దళిత నాయకుని ద్వారా అదే శాఖకు చెందిన మంత్రికి ఇచ్చేందుకు ఒక్కొక్కరితో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.13 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

 

 తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు

 కళాశాల ఉంటేనే వసతిగృహం ఉంటుంది. లేదంటే లేదు. డబ్బు డ్రా చేసిన మాట వాస్తవమే. కొందరు పేద విద్యార్థులు గ్రామాలకు వెళ్లకుండా ఉంటే వారి హాజరు, ఓచర్లపై సంతకాలు తీసుకోవాలి. మిగిలిన సొమ్మును ఏమి చేయాలనేది ఉన్నతాధికారులను అడగాలి. అలా కాకుండా డబ్బు డ్రా చేశారని బయట పడగానే హడావుడిగా ఎవరికి తోచినట్లు వారు చేయడంతో ఇరుక్కుపోయారు. ఆడిటింగ్ నివేదిక అందిన వెంటనే కలెక్టర్‌కు, శాఖ డెరైక్టర్‌కు శాఖాపరమైన చర్యల నిమిత్తం నివేదిక పంపుతాము.

 -  జీవపుత్రకుమార్, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top