అధికార ముద్ర ఉంటేనే..


సబ్‌స్టేషన్ కాంట్రాక్టుల్లో అక్రమాలు



 సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అర్హతలు, సీనియారిటీ ముఖ్యం కాదు. అధికార పార్టీ నుంచి రికమండేషన్ లెటర్  ఉంటేనే కాంట్రాక్టు. ఇదీ విద్యుత్ సబ్‌స్టేషన్ల కాంట్రాక్టు కోసం అధికారులు పెడుతున్న కండీషన్. దీంతో పాటు టెండర్లలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంట్రాక్టర్ 15 నుంచి 20 వేల రూపాయలు చెల్లించాల్సిందే. లేకపోతే  దరఖాస్తులు పరిశీలించరు. ఇది మార్కాపురం డివిజన్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ల కాంట్రాక్టులో జరుగుతున్న తంతు. ఆగస్టు ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 16 వరకూ మార్కాపురం డివిజన్‌లోని 33/11 కెవీ సబ్‌స్టేషన్లను కాంట్రాక్టుకు ఇచ్చేందుకు గత నెల 24న టెండర్లు పిలిచారు.



మార్కాపురం డివిజన్‌లో మొత్తం 80 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. మొత్తం ఎనిమిది నెలల కాంట్రాక్టుకు గాను కాంట్రాక్టర్‌కు ట్రాన్స్‌కో ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తుంది. వాచ్‌మెన్‌తో కలిపి ఐదుగురు సిబ్బందికి, సబ్‌స్టేషన్ నిర్వహణకు అయ్యే ఖర్చును కాంట్రాక్టర్  ఈ మొత్తంలో నుంచే భరించాల్సి ఉంటుంది.  ఈ టెండర్లను అర్హతల ఆధారంగా కాకుండా  ఎటువంటి అర్హత లేకపోయినా అధికార పార్టీ నుంచి రికమండేషన్ లెటర్ ఉంటేనే ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.



ఒక్కొక్కరికి నాలుగైదు సబ్‌స్టేషన్లు కాంట్రాక్టు ఇస్తామని చెప్పి వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కాపురం అధికారి ఒకరు ఈ వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ టెండర్లను సోమవారం ఖరారు చేస్తారు. అర్హత ఉన్న వారికే కాంట్రాక్టు కేటాయించాలని లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. సాంకేతికమైన పనులకు సీనియర్లను కాదని అర్హత లేనివారికి కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top