మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం - Sakshi


► 2017–19 సంవత్సరానికి మద్యం విధానం  ప్రకటించిన ప్రభుత్వం

► 30 వరకు దరఖాస్తుల స్వీరణ

► 31న లాటరీ నిర్వహణ


విజయనగరం రూరల్‌ : నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2017–19 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 210 దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ శుక్రవారం గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దరఖాస్తులు స్వీకరించడానికి కలెక్టరేట్‌ సముదాయంలోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో  సర్కిల్‌ వారీగా బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు.


ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 31న పట్టణంలోని నాయుడు ఫంక్షన్‌ హాల్‌లో లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగలక్ష్మి తెలిపారు. మద్యం విధివిధానాలపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం ద్వారా ఏడు శ్లాబ్‌ల్లో దుకాణాలకు ఫీజు వసూలు చేయనున్నట్లు చెప్పారు.


గతేడాది లైసెన్స్‌ ఫీజుల రూపంలో ఎక్సైజ్‌ శాఖకు సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరిందన్నారు. అయితే గతంలో ఉన్న లైసెన్స్‌ ఫీజును ప్రభుత్వం భారీగా తగ్గించి, దరఖాస్తు ఫీజును పెంచిందని తెలిపారు. ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో దుకాణం ఏర్పాటుకు లైసెన్స్‌ ఫీజు గతంలో రూ. 30 లక్షలుండగా, ప్రస్తుతం రూ. 7.5 లక్షలు.. ఐదు వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో దుకాణం ఏర్పాటుకు గతంలో రూ. 34 లక్షలుండగా, ప్రస్తుతం రూ. 8.5 లక్షలు.. పది వేల నుంచి 25 వేల లోపు జనాభా ఉంటే గతంలో రూ. 37 లక్షలు కాగా ప్రస్తుతం రూ. 9.5 లక్షలు.. 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉంటే గతంలో రూ. 40 లక్షలు వసూలు చేయగా నేడు రూ. 10 లక్షలు వసూలు చేయనున్నట్లు చెప్పారు.


అలాగే గతంలో 50 వేలకు పైబడి 3 లక్షల లోపు జనాభా ఉంటే లైసెన్స్‌ ఫీజు కింద రూ. 45 లక్షలు వసూలు చేయగా ప్రస్తుతం రూ. 11.25 లక్షలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో కేవలం 50 వేల లోపు జనాభా, 50 వేల నుంచి మూడు లక్షల జనాభా ఉన్న శ్లాబులే ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా  మండలాల పరిధిలో 160 దుకాణాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 50 మద్యం దుకాణాలు ఉన్నాయని తెలిపారు. మండల పరిధిలో దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు ఫీజు ఐదు వేల రూపాయలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.


మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో అయితే దరఖాస్తు ఫీజు ఐదు వేల రూపాయలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు 75 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే వీటితో పాటు ఈఎండీ కింద మూడు లక్షల రూపాయలు డీడీ జతచేయాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తులను కలెక్టరేట్‌లోని ఎక్సైజ్‌ ఈఎస్‌ కార్యాలయంలో స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేయాలని సూచించారు. అయితే ఒక ఈఎండీతో ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు తిరిగి  చెల్లించరని, దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుందన్నారు.


వెబ్‌సైట్‌లో దరఖాస్తు పూర్తిచేసి, వాటితో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఈఎండీ మూడు లక్షల రూపాయల డీడీ జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలో 69 మద్యం దుకాణాలు ఉండగా, విజయనగరం డివిజన్‌ పరిధిలో 141 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రహదారులకు ఇరువైపులా ఉన్న మద్యం దుకాణాల్లో ఇప్పటికే తరలించిన వాటికి 24 నెలలకు, ఇంకా తరలించని దుకాణాలకు 27 నెలలకు లైసెన్స్‌ ఫీజు వసూలు చేసి దుకాణాలు కేటాయించనున్నామని డీసీ నాగలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు శంభూప్రసాద్, విక్టోరియా రాణి, ఏఈఎస్‌లు వెంకటరావు, త్యాగరాజు, భీమ్‌రెడ్డి, ఎక్సైజ్‌ సీఐలు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top