జగన్ కేసులో దర్యాప్తు పూర్తి: సీబీఐ

జగన్ కేసులో దర్యాప్తు పూర్తి: సీబీఐ - Sakshi


జగన్ కేసులో ప్రత్యేక కోర్టుకు నివేదించిన సీబీఐ

బెయిల్ మాత్రం ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు..ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపణ

 సీబీఐ వాదనలను తోసిపుచ్చిన జగన్ తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ దర్యాప్తు పూర్తయినా జైల్లోనే ఉంచాలనడం ఎంతవరకు సమంజసం?

అలా కోరడంలో సీబీఐ ఆంతర్యం అర్థం కావడం లేదు


9 నెలల కాలంలో సాక్షులను ప్రభావితం చేయని జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడెలా చేస్తారు?

 దర్యాప్తు పూర్తయితే బెయిల్‌కు అర్హులని సుప్రీంకోర్టు రెండు సందర్భాల్లో స్పష్టం చేసింది

 2జీ కేసులో నిందితులందరికీ సుప్రీంకోర్టు బెయిలిచ్చింది

 దర్యాప్తు పూర్తి కాలేదనే జగన్‌కు బెయిల్ ఇవ్వలేదు

 ఇప్పుడు దర్యాప్తు పూర్తయిపోయి చార్జిషీట్లన్నీ కూడా దాఖలయ్యాయి

 సాక్షులను ప్రభావితం చేస్తారనే అంశాన్ని సుప్రీం ఎన్నడూ ప్రస్తావించలేదు..సీబీఐవి కేవలం అపోహలు, అనుమానాలే




 

 సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాల్లో తమ దర్యాప్తు పూర్తయిపోయిందని సీబీఐ బుధవారం ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించింది. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. సీబీఐ వాదనలను జగన్ తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ తోసిపుచ్చారు.

 

 దర్యాప్తు పూర్తయిపోయిన తర్వాత కూడా జగన్‌ను జైల్లోనే ఉంచాలని కోరడంలో సీబీఐ ఆంతర్యమేమిటో తమకు అర్థం కావడం లేదని అన్నారు. దర్యాప్తు పూర్తయిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని సుప్రీంకోర్టు 2012 అక్టోబర్ 5 నాటి ఉత్తర్వులు, 2013 మే 9న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఈ కోర్టుకు సూచించిందని తెలిపారు. దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్లన్నీ దాఖలు చేసిన తర్వాత బెయిల్ పొందేందుకు నిందితులు అర్హులని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో విస్పష్టమైన తీర్పులు ఇచ్చిందంటూ సుశీల్‌కుమార్ వాటిని కోర్టు ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు చీఫ్ జడ్జి యు.దుర్గాప్రసాదరావు తీర్పును వాయిదా వేశారు. ఈ నెల 23న తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు విధించిన నాలుగు నెలల గడువు పూర్తయిందని, సీబీఐ కూడా చార్జిషీట్లన్నీ దాఖలు చేసిందని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన చీఫ్ జడ్జి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. ఆ మేరకు బుధవారం ఈ పిటిషన్‌ను మరోసారి విచారించారు. ఇదే సమయంలో సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జగన్ తరఫున సుశీల్‌కుమార్, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ సురేంద్ర వాదించారు. బెయిల్ పొందడం నిందితుని ప్రాథమిక హక్కని, ఈ కేసులో మొత్తం దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో జగన్‌కు బెయిల్ మంజూరు చేయాలని సుశీల్‌కుమార్ కోర్టును కోరారు.

 

 సుప్రీం రెండుసార్లు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది...

 

 ‘జగన్‌మోహన్‌రెడ్డి కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు రెండు పర్యాయాలు అంటే 2012 అక్టోబర్ 5, 2013 మే 9 ఉత్తర్వుల ద్వారా స్పష్టంగా చెప్పింది. మే 9వ తేదీ ఉత్తర్వుల్లో దర్యాప్తును పూర్తి చేసేందుకు సీబీఐకి నాలుగు నెలలు గడువు ఇచ్చింది. ఇచ్చిన గడువులోగా తుది చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్దేశించింది. తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు రెండు పర్యాయాలూ స్పష్టంగా తీర్పునిచ్చింది. కేవలం దర్యాప్తు జరుగుతోందన్న కారణంగానే బెయిల్‌ను నిరాకరిస్తున్నామని తేల్చిచెప్పింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తిచేసి 10 చార్జిషీట్లు దాఖలు చేసింది. దర్యాప్తు చేయడానికి ఇంకా ఏమీ లేదని స్పష్టం చేస్తోంది.

 

 ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ పొందేందుకు అర్హుడు. వ్యక్తుల హోదాను బట్టి బెయిల్ నిరాకరించడం ఎంతమాత్రం సమంజసం కాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. జగన్ బెయిల్ పిటిషన్‌పై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయనకు ఇప్పుడు బెయిల్ మంజూరు చేయండి. రిమాండ్‌లో ఉన్న సమయంలోనే తుది విచారణ చేయాలని కోరడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం.’ అని సుశీల్‌కుమార్ వివరించారు.

 

 దర్యాప్తు పూర్తయితే బెయిల్ పొందవచ్చునని పలు తీర్పులు ఇచ్చింది...

 

 ‘దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. పారదర్శకమైన తుది విచారణ (ట్రయల్) జరగాలంటే నిందితులకు బెయిల్ ఇవ్వాలి. నిందితులు బయట ఉన్నప్పుడే వారు తమ వాదనను సమర్ధవంతంగా వినిపించుకునే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న ఏకైక కారణంతోనే జగన్‌కు ఇప్పటివరకు బెయిల్ రాలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టులు సైతం ఈ కారణంతోనే జగన్‌కు బెయిల్ నిరాకరించాయే తప్ప, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అభిప్రాయాన్ని ఎన్నడూ వ్యక్తం చేయలేదు. 2జీ కేసులో కూడా నిందితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సహా నిందితులందరికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బెయిల్ పొందేందుకు జగన్ అర్హుడు. కాబట్టి బెయిల్ మంజూరు చేయండి.’ అని ఆయన కోర్టును అభ్యర్థించారు.

 వివక్షతాపూరితంగా అరెస్టు చేశారు...

 

 ‘జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి 2011 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ (ఆర్‌సీ నెంబర్ 19(ఎ)) నమోదు చేసింది. జగన్‌ను కనీసం విచారించకుండానే మెజారిటీ దర్యాప్తు పూర్తి చేసింది. దాదాపు 9 నెలలపాటు దర్యాప్తు చేసి మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఈ దశలో ఏ రోజూ జగన్ దర్యాప్తులో జోక్యం చేసుకోలేదు. సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గత ఏడాది ఏప్రిల్ 7న విచారణకు స్వీకరించింది. మే 28న జగన్‌ను వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. పార్లమెంట్ సభ్యునిగా, రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నా సీబీఐ విచారణకు జగన్ హాజరయ్యారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించినా.. గత ఏడాది మే 27న సరైన కారణాలు చూపకుండానే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ చర్యను ఈ కోర్టు తప్పుపట్టింది.

 

 కస్టడీకి అప్పగించాలని కోరినా తిరస్కరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అనేకమంది బయటే ఉన్నారు. అయినా జగన్‌ను మాత్రం వివక్షతాపూరితంగా అరెస్టు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. జగన్ బెదిరించినట్లు ఒక్క సాక్షి కూడా ఇప్పటి వరకు ఆరోపించలేదు. సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ కూడా ఎప్పుడూ, ఎక్కడా ఆరోపించలేదు. కేసు నమోదు తర్వాత జగన్ 9 నెలలు బయటే ఉన్నారు. అలాంటి ఆలోచనే ఉంటే 9 నెలల్లో ఏమైనా చేయవచ్చు. 9 నెలలంటే ఓ బిడ్డకు జన్మనిచ్చేంత సమయం. కానీ అప్పుడూ, ఎప్పుడూ ప్రభావితం చేయని వ్యక్తి కొత్తగా ఇప్పుడేదో చేస్తారనడం నిరాధారం. అపోహలను, అనుమానాలను సాకుగా చూపి బెయిల్ ఇవ్వరాదని సీబీఐ కోరడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం.’ అని సుశీల్‌కుమార్ వివరించారు.

 

 16 నెలలుగా జైల్లో ఉన్నారు...

 

 ‘జగన్ 16 నెలలుగా జైల్లో ఉన్నారు. దర్యాప్తు ప్రక్రియలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. జగన్‌ను జైల్లో ఉంచడం ద్వారా భార్యాపిల్లలకు, కుటుంబం, బంధువులు, శ్రేయోభిలాషులు, సమాజానికి దూరం చేశారు. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది. ఆయన్ను జైల్లో ఉంచడం ద్వారా వారిని బాధించడం ఎంతవరకు సమంజసం? ఏం ఆశించి ఆయన్ను జైల్లో ఉంచాలని సీబీఐ భావిస్తోంది? ఇలా కోరడంలో సీబీఐ ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ’అని అన్నారు.

 

 సీబీఐది అపోహ మాత్రమే...

 

 ‘జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారనేది కేవలం సీబీఐ అపోహ మాత్రమే. సీబీఐ ఈ తరహా ఆరోపణలు గతంలో ఎప్పుడూ చేయలేదు. జగన్ బెయిల్ పిటిషన్లు గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణకు వచ్చినప్పుడు కూడా... దర్యాప్తు పెండింగ్‌లో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వరాదని మాత్రమే సీబీఐ చెప్పింది. దర్యాప్తు పూర్తికాని అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానాలు జగన్‌కు బెయిల్ నిరాకరించాయి. అయితే తాజాగా జగన్ బెయిల్‌ను వద్దనేందుకు సీబీఐ ఎటువంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదు. కేవలం ఆపోహలు, అనుమానాల ఆధారంగా బెయిల్ ఇవ్వరాదని కోరుతోంది. మేం ఎక్కడికీ పారిపోవడం లేదు. తుది విచారణకు సిద్ధంగా ఉన్నాం. పది చార్జిషీట్లలో విచారణకు సిద్ధంగా ఉన్నాం. మేం తప్పుచేయలేదని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.

 

 అలాంటప్పుడు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. సీబీఐ వాదన హాస్యాస్పదంగా, నిరాధారమైనదిగా ఉంది. జగన్‌ను, సాయిరెడ్డిని ఒకే జైలులో ఉంచితే వారు కుట్ర పన్నుతారని గతంలో ఆరోపించింది. సీబీఐ అభ్యంతరాన్ని ఇదే కోర్టు తోసిపుచ్చింది. ఆరు దేశాలకు లెటర్ ఆఫ్ రొగెటరీలు పంపాం కాబట్టి బెయిల్ ఇవ్వరాదని గత ఏడాది ఫిబ్రవరిలో కోరింది. ఏడాదిన్నర గడిచినా ఇప్పటివరకు వాటికి ఎటువంటి సమాధానం రాలేదు. కేవలం బెయిల్‌ను అడ్డుకునేందుకే, నిందితుల హక్కులను కాలరాసేందుకే సీబీఐ ఈ తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయినా బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనా కోర్టును కోరవచ్చు.’ అని వివరించారు.

 

 తుది విచారణను అడ్డుకుంటారు: సీబీఐ

 

 జగన్ అత్యంత శక్తివంతుడని, బెయిల్ ఇస్తే తుది విచారణను అడ్డుకుంటారనేది తమ అనుమానమని సీబీఐ న్యాయవాది సురేంద్ర అన్నారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో నిందితుల బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ మేరకు తాము దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్లు దాఖలు చేశామని ఆయన కోర్టుకు నివేదించారు. దర్యాప్తు పూర్తయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు.

 

 రాజకీయ పార్టీలకు  ఏం సంబంధం?

 

 ‘ఈ కేసులో దర్యాప్తు తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు సీబీఐ డెరైక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు మీడియా ద్వారా తెలిసింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని దీన్ని బట్టి అర్థమవుతోంది. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేందుకు వీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది రూ.43 వేల కోట్ల కుంభకోణమని, జగన్‌ను శిక్షించాలని వారు కోరుతున్నారు. ఏ ప్రాతిపదికన వారు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దర్యాప్తు తీరుపై, కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడడం ఎంతవరకు సమంజసం? రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న పని ఇది. 2జీ కేసు లక్షా 45 వేల కోట్ల కుంభకోణమని మొదట సీబీఐ ప్రకటించింది. తర్వాత ఆ ఆరోపణలు నిజం కాదని తేలింది. జగన్ కేసులోనూ అన్ని చార్జిషీట్లు మొచత్తం లెక్కవేసినా రూ.1500 కోట్లు కూడా పెట్టుబడులు రాలేదని తేల్చింది. ఈ మొత్తం కూడా సదరు కంపెనీలకు పెట్టుబడులుగా వచ్చాయే తప్ప, మరొకటి కాదు. ఇది అసాధారణమైన ఆర్థిక నేరమన్న సీబీఐ వాదనలో నిజం లేదని తేలిపోయింది. సీబీఐ చేసిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని, ఈ కేసుతో సంబంధం లేనివని తేలిపోయాయి.’ అని సుశీల్‌కుమార్ కోర్టుకు చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top