సొంత పాఠాలు చెల్లవు

సొంత పాఠాలు చెల్లవు - Sakshi


సాక్షి, కర్నూలు : ఇష్టారాజ్యంగా పేర్లు పెట్టుకుని, సంబంధం లేని పుస్తకాలను పిల్లలతో కొనుగోలు చేయించి.. ‘విద్యా శాఖ’ నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేటు విద్యా సంస్థల చర్యలను అరికట్టేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులకు అవసరం ఉన్నా.. లేకున్నా.. రూ. వేలతో పుస్తకాలను అంటగట్టే విధానాన్ని రూపుమాపేందుకు  సన్నద్ధమైంది. అనవసర గైడ్లు, స్టడీ మెటీరియళ్లను అడ్డుకోనుంది. దీనికోసం జిల్లా అధికారులు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు మీరినట్లు తేలితే పాఠశాల గుర్తింపును రద్దు చేసేందుకూ వెనుకాడబోమని విద్యాశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. 



ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు సమాంతర విద్యా వ్యవస్థను నడపడం గతం. బోర్డు పరీక్షలు మినహా మిగిలిన తరగతులకు సంబంధించిన పరీక్షలను విద్యాశాఖ షెడ్యూల్‌తో సంబంధం లేకుండా నిర్వహించుకునేవారు. కొంతకాలంగా విద్యాశాఖ నిఘా పెంచడంతో ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. ‘బట్టీ చదువు’లకు చరమగీతం పలకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘కంటిన్యూయస్ అండ్ కాంప్రెహెన్సీవ్ ఎవాల్యూయేషన్(సీసీఈ) పద్ధతిని గతేడాది నుంచి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో గత ఏడాది ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లోని సిలబస్‌ను సీసీఈకి అనుగుణంగా సమూలంగా మార్చారు.



కానీ ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం ప్రాథమిక తరగతుల పాఠ్య పుస్తకాలను సీసీఈ విధానంతో సంబంధం లేకుండా తమకు అనుగుణంగా ముద్రింపజేసుకున్నారు. దీనివల్ల విద్యార్థుల సృజనాత్మకలో మార్పేమీ ఉండబోదని కొందరు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని తరగతుల్లో తప్పని సరిగా సీసీఈ ప్రణాళికనే అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఈవో సుప్రకాశ్ అన్ని ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీ చేయాలని డిప్యూటీ ఈవోలకు, ఎంఈవోలకు, ఆదేశాలివ్వాల్సి ఉంది. ప్రైవేటుగా బోధనకు పుస్తకాలు, మెటీరియళ్లు వినియోగించినట్లు తనిఖీల్లో తేలితే గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది.  



 తగ్గనున్న పుస్తక భారం..

 సీసీఈ పక్కాగా అమలైతే విద్యార్థుల పుస్తకాల నుంచి బరువు తగ్గే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఇటీవలే చేపట్టిన ఓ సర్వే ప్రకారం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 10-12 కిలోలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులు 15-17 కిలోల బరువైన పుస్తకాలను నిత్యం మోస్తున్నట్లు తేలింది. దీంతో చిన్నారుల వెన్నెముకపై భారం పడి ఆరోగ్యంపై దుష్ర్పభావం పడుతోంది. అందుకే అనవసర భారం అటు పిల్లలపై, ఇటు తల్లిదండ్రులపై మోపనీయొద్దని విద్యాశాఖ నిర్ణయించుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top