అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్


అల్లిపురం: ఇళ్లలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగలను కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాం డ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి సామగ్రి, 4 కెమెరాలు, 3 రిస్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో గురువారం క్రైం డీసీపీ టి.రవికుమార్ మూర్తి కేసు వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా జే స్టాంబ్ చౌక్ దరి, పూర్ణా బిలాయ్-3కి చెందిన బమ్మిడి సంతోష్ 2009 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై 27 ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో కూడా నిందితుడు.

 

  ఇతను ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో 9 సార్లు సెంట్రల్ జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ ఏడాది మార్చి 23న విజయనగరం సబ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్న అతనికి పందిమెట్ట, నౌరోజీ రోడ్డు, ముత్యాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న రేకల అప్పలరాజు కంచరపాలెం కపరాడలో షెల్టర్ ఏర్పాటు చేశాడు. పోలీసులు వీరిపై నిఘా ఉంచడంతో తరచూ బస మారుస్తుండేవారు. కాగా.. బమ్మిడి సంతోష్‌కు జైలులో పరిచయమైన శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం కృష్ణాపురంనకు చెందిన కిల్లి వెంకటేష్ తోడయ్యాడు. శ్రీకాకుళం, ఆమదాలవలసలో వెంకటేష్‌పై కేసులు నమోదై ఉన్నాయి.  

 

 నగరంలో ఆరు దొంగతనాలు

 వీరు ముగ్గురు కలసి నగరంలో ఎయిర్‌పోర్టు, ఆరిలోవ, పీఎం పాలెం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకొక్కటి, దువ్వాడ స్టేషన్ పరిధిలో రెండు చొప్పున మొత్తం ఆరు ఇంటి దొంగతలనాలకు పాల్పడ్డారు. ఈ దొంగతనాలకు సంబంధించి 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి సామగ్రి, 5 కెమెరాలు, 12 రిస్ట్ వాచ్‌లు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1.59 లక్షల నగదు అపహరించుపోయారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వద్ద గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి సామగ్రి, 4 కెమెరాలు, 3 రిస్ట్ వాచీలు, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు  క్రైం డీసీపీ తెలిపారు. కేసులను ఛేదించిన క్రైం సీఐ ఆర్. గోవిందరావు, ఎస్‌ఐలు జి. రవికుమార్, డి. విశ్వనాథం, కానిస్టేబుళ్లు ఎస్. హరిప్రసాద్, అప్పలరాజు, రమేష్, హోం గార్డు టి. అప్పలరాజులను డీసీపీ అభినందించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top