ఇంటర్ స్పాట్ పైకం పెంపు


శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనం (స్పాట్) నిర్వహణలో పాల్గొనే అధికారులకు, అధ్యాపకులకు ఇంటర్మీడియెట్ బోర్డు తీపికబురు అందించింది. ప్రస్తుతం అందజేస్తున్న రెమ్యూనిరేషన్‌కు మరో 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ జారీచేశారు. దీంతో ఇంటర్ పరీక్షలతోపాటు, మూల్యాంకనంలోను పాల్గొనే  సుమారు రెండు వేల మంది మంది అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి లబ్ధిచేకూరనుంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సైతం పెంచిన రెమ్యూనిరేషన్ వర్తించనుంది.

 

 ప్రతి మూడేళ్లకొకసారి పెంపు

 ఇదిలా ఉండగా ఇకపై ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బంది రెమ్యూనిరేషన్ పెంచాలని బోర్డు భావించింది. ప్రస్తుతం రోజుకు 30 పేపర్లు దిద్దే ఎగ్జామినర్లకు పేపర్‌కు రూ.12.10 చొప్పున రూ.363  చెల్లిస్తుండగా పెరిగిన రెమ్యూనిరేషన్‌తో రూ.15.125 చొప్పున రూ.453 చెల్లించనున్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు, భోజన, బస్సు ఛార్జీల నేపథ్యంలో ప్రతి మూడేళ్లకొకసారి రెమ్యూనిరేషన్‌ను కనీసం 20 శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని బోర్డు కూడా స్పష్టం చేసింది. డీఏ కూడా పెరగనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బోర్డుకు, జూనియర్ లెక్చరర్ల సంఘం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే ఈ రెమ్యూనిరేషన్ ఏ మూలకు సరిపోదని అధ్యాపకులు భావిస్తున్నారు. మూడేళ్లకొకసారి కాకుండా ప్రతి ఏడాది కనీసం 10 శాతం మేర రెమ్యూనిరేషన్ పెంచేలా బోర్డు చొరవతీసుకోవాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు.

 

 ఇప్పటికే వెలువడిన షెడ్యూల్..

 ఇదిలా ఉండగా మార్చి 2వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానుండగా మార్చి 16తో జనరల్ కోర్సుల పరీక్షలు ముగియనున్నాయి. దాదాపు మార్చి 17 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు జిల్లా అధికార యంత్రంగం ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top