అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్‌ మస్తాన్‌ వలీ అరెస్ట్‌

అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్‌ మస్తాన్‌ వలీ అరెస్ట్‌


మైదుకూరు : కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన మస్తాన్‌వలి అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రధాన స్మగ్లర్‌ భాస్కర్‌ను వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మస్తాన్‌వలి, భాస్కర్‌తో పాటు మరికొందరు నల్లమల అడవుల నుంచి మైదుకూరు మండలం వనిపెంట మీదుగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు, రూరల్‌ సీఐ నాగభూషణం నేతృత్వంలో పోలీసులు దాడి నిర్వహించారన్నారు.


ఇందులోభాగంగా మైదుకూరు మండలం అన్నలూరు గ్రామం వద్ద వేగంగా వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులో ఉన్నవారు కారుతో పోలీసులను తొక్కించి తప్పించుకు వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కారును వెంబడించి అందులో ఉన్న మస్తాన్‌ వలి, భాస్కర్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్‌ వలి ఈ ఏడాది మార్చినెలలో అరెస్టయి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్‌ జైలులో ఉన్నప్పుడు కూడా జైలు నుంచే ఫోన్‌ ద్వారా స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడేవాడన్నారు. గత నెలలో బెయిల్‌పై విడుదలై తిరిగి యథావిధిగా స్మగ్లింగ్‌కు పాల్పడుతుండటంతో పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్టు చేశామన్నారు.



పేరు మోసిన స్మగ్లర్లతో సంబంధాలు

మస్తాన్‌వలీ మహరాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రధాన స్మగర్లతో సత్సంబంధాలు పెట్టుకుని కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలోని నల్లమల అడవుల నుంచి దుంగలను దేశ సరిహద్దులు దాటించేవాడని డీఎస్పీ వెల్లడించారు. మస్తాన్‌ వలీకి దేశంలోని 90మందికి పైగా ప్రధాన స్మగ్లర్లతో అనుబంధం ఉందని..గతంలో పలు కేసులు కూడా వారిపై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జైలులో ఉండి కూడా స్మగ్లింగ్‌ రాకెట్‌ నడిపే వాడన్నారు. మస్తాన్‌ వలీతో కలిసి  స్మగ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రధాన స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు.. ప్రధాన స్మగ్లర్‌ మస్తాన్‌వలీని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అర్బన్, రూరల్‌ సీఐలతోపాటు ఎస్‌ఐ చలపతి, పీఎస్‌ఐ కృష్టమూర్తి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.. మస్తాన్‌వలీతో పాటు, భాస్కర్‌ అనే స్మగ్లర్‌ను కోర్టులో హాజరు పరిచామన్నారు.

 

జైలు నుంచే కార్యకలాపాలు


మస్తాన్‌వలీ ఈ ఏడాది మార్చిలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్‌జైలులో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న జైలు సిబ్బంది సహకారంతో సెల్‌ఫోన్‌లు తెప్పించుకొని జైలు నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహించేవాడని డీఎస్పీ తెలిపారు. గతంలో చిత్తూరు జైలులో పరిచయమైన భాస్కర్‌ అలియాస్‌ ప్రసాద్‌తో కలసి విచ్చలవిడిగా స్మగ్లింగ్‌ చేసేవాడన్నారు. మస్తాన్‌ వలీ చాగలమర్రి మండలం ముత్యాలపాడు నుంచి ఎంపీటీసీగా గెలుపొంది ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నాడని, అతని మొదటిభార్య కొండపల్లి స్వప్న ప్రస్తుతం సర్పంచ్‌గా ఉన్నారని తెలిపారు. ఇతను సినీ నటి నీతూ అగర్వాల్‌ను కూడా వివాహం చేసుకున్నాడని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top