సాగర జలమే శాంతికి సాధనం


ఉగ్రవాదం, ఇతర సవాళ్లను సమష్టిగా తిప్పికొడదాం

ఐఎఫ్‌ఆర్‌లో ప్రపంచ దేశాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపు


   

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘అంతర్జాతీయ ఉగ్రవాదంతో సహా సంప్రదాయేతర సవాళ్లను తిప్పికొట్టడానికి ప్రపంచ దేశా ల నౌకా దళాలు సమష్టిగా పునరంకితం కావల్సిన ఆవశ్యకత ఉంది. వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశాల మధ్య శాంతి, సుహృద్భావాన్ని పెంపొందించేందుకు సముద్ర జలాలను సాధనంగా చేసుకోవాలి’’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి శనివారం విశాఖపట్నం సముద్రజలాల్లో ఐఎఫ్‌ఆర్ నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి  ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న వివిధ దేశాల నౌకా దళాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే...



 శాంతి సుస్థిరతలకు చొరవ

 సముద్ర జలాలే ప్రపంచ దేశాలను అనుసంధానిస్తున్నాయి. వాటి ద్వారా  శాంతి, సుహృద్భావాన్ని పెంపొందించడంలో ప్రపంచ దేశాల నౌకాదళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మనం సమష్టిగా పనిచేసి సముద్రాలను సురక్షితంగా ఉంచడం ద్వారా యావత్ మానవాళికి ప్రయోజనం కలిగించాలి. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన మారి టైమ్ వ్యూహాన్ని పునఃసమీక్షించుకుం టోంది. సముద్రజలాల ద్వారా శాంతి, సుస్థిరతలను పెంపొందించేందుకు ఇతర దేశాల సహకారానికి భారత్ చొరవ చూపుతోంది. ప్రధానంగా హిందూ మహాసముద్ర దేశాల మధ్య సమాచార మార్పిడి, పరస్పర సహకారాన్ని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ‘సముద్ర జలాల ద్వారా ఐక్యత’ నినాదంతో భారత్ నిర్వహిస్తున్న ఈ సమీక్ష ఇందుకు చక్కటి అవకాశం.



 స్నేహ బంధాల వృద్ధి...  

 ఐఎఫ్‌ఆర్-2016 భారత నౌకాదళ పాట వాన్ని ప్రదర్శించడంతోపాటు ప్రపంచ దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడానికి చక్కని వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నౌకాదళాలను భారత సముద్ర జలాల్లోకి ఆహ్వానించింది. దేశాల మధ్య శాంతి, సహకారాన్ని పెంపొందించి తీరప్రాంత భద్రతకు సముద్రాలను సాధనంగా చేసుకోవచ్చని నిరూపించింది. దీనికి 50 దేశాలు హాజరుకావడం ఐఎఫ్‌ఆర్ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తోంది. ‘సముద్రజలాల ద్వారా మనమంతా ఒక్కటే’ అనే నినాదాన్ని నిజం చేస్తోంది. అంతర్జాతీయ నౌకాదళాల సమీక్షలో పాల్గొంటున్న విదేశీ నౌకా దళాల సభ్యులు తమ దేశాల బ్రాండ్ అంబాసిడర్స్‌గా శాంతి సందేశాన్ని తీసుకువచ్చారు. తద్వారా సముద్రాలపై శాంతి, సుహృద్భావం, సుస్థిరత, అభివృద్ధి సాధించడానికి దోహదపడ్డారు. భారతదేశం నుంచి శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని తమ దేశాలకు తీసుకువెళ్లి పరస్పర సహకారం, సురక్షిత పరిస్థితులను పెంపొందిస్తారని ఆశిస్తున్నాను.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top