తెలుగుదేశం స్ట్రీట్‌ ఫైట్‌

తెలుగుదేశం స్ట్రీట్‌ ఫైట్‌ - Sakshi


ప్రకాశం టీడీపీ అధ్యక్ష ఎన్నిక రణరంగం

- కరణం, గొట్టిపాటి వర్గాల బాహాబాహీ

- గొట్టిపాటిపై చేయి చేసుకున్న కరణం బలరాం

- గొట్టిపాటి గన్‌మెన్‌ను చితకబాదిన కరణం అనుచరులు




సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం రణరంగాన్ని తలపించింది. మంగళవారం ఒంగోలులో జరిగిన ఈ సమావేశం వేదికగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గాలు బాహాబాహీకి దిగాయి. బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన జంట హత్యలకు గొట్టిపాటే కారణమని ఆగ్రహంతో రగిలిపోతున్న కరణం వర్గం ఆయనపై దాడికి దిగింది. దీనిని గొట్టిపాటి వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. గొట్టిపాటి చొక్కా చిరిగి కిందపడిపోయారు.



టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్‌లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణతో పాటు మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావు సమావేశానికి హాజరయ్యారు. పాత నేతలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశానికి వచ్చారు. 11 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌ తమ వర్గీయులతో సమావేశానికి హాజరయ్యారు. 11.15 గంటలకు అనుచరులతో కలసి ఎమ్మెల్యే గొట్టిపాటి సమావేశానికి వచ్చారు. సమావేశ మందిరం గడపలోనే గొట్టిపాటి, కరణం ఎదురుపడ్డారు. గొట్టిపాటి గన్‌మేన్‌ కరణం గన్‌మేన్‌ను నెట్టబోగా కరణం ఆగ్రహంతో రగిలిపోయి దాడికి పాల్పడ్డారు. గొట్టిపాటిపై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. కరణం వర్గీయులు ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగారు. గొట్టిపాటి వర్గీయులు సైతం ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.



సర్దుబాటుకు మంత్రుల ప్రయత్నం...

ఇరు వర్గాల తోపులాట, కేకలతో సమావేశ మందిరం దద్దరిల్లింది. పరిస్థితి అదుపు తప్పుతున్న విషయం గమనించిన మంత్రులు నారాయణ, పరిటాల సునీత, రాఘవరావు ఇరువర్గాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. వేమవరంలో టీడీపీ నేతలను హత్య చేయించిన గొట్టిపాటిని సమావేశానికి ఎలా అనుమతిస్తారంటూ కరణం మంత్రులను నిలదీశారు. గొట్టిపాటిని వెంటనే సమావేశం నుంచి పంపించాలని సూచించారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో మంత్రులు, జిల్లా అధ్యక్షుడి ఎన్నికల విషయంలో అభిప్రాయం తీసుకొని గొట్టిపాటిని బయటకు పంపించారు. సమావేశంలో రసాభాసగా మారడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, ఆమంచి కృష్ణమోహన్‌ సైతం పది నిమిషాల్లోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు.



దేనికైనా సిద్ధం: కరణం బలరాం

కింద నుంచి పై స్థాయి వరకు పార్టీ కార్యకర్తలను రక్షించుకునే విషయంలో దేనికైనా సిద్ధపడతా. వెనుకడుగు వేయబోను. కొందరు ఫిరాయింపు నాయకులు దిగజారి ప్రవర్తించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నాలుగు రోజుల క్రితం హత్యలు చేయించి నాయన ఏం ముఖం పెట్టుకొని సమావేశానికి వస్తారు? ప్రభుత్వ గన్‌మెన్లను సైతం తన స్వార్థానికి వాడుకునేంతగా గొట్టిపాటి దిగజారారు. ఆర్థికంగా లబ్ధి పొందేందుకే పార్టీ మారారు తప్ప పార్టీకి మేలు చేద్దామని కాదు. నా కార్యకర్తలను రక్షించుకునే విషయంలో ఎంతవరకైనా వెళ్తా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top