ప్రభుత్వ వైద్యులపై ఇంటెలిజన్స్ కన్ను!


సాక్షి, గుంటూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పనితీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు వైద్యుల హాజరు, ఆస్పత్రుల్లో ఎంతసేపు ఉంటున్నారు, ప్రైవేటుగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారా..? అనే అంశాలపై ఇంటెలిజన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్కకాటు బాధితునికి వైద్యచికిత్స అందకపోవటంపై దుమారం రేగటంతో అప్రమత్తమైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.

 

జిల్లాలో పరిస్థితి.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యుల్లో ఎక్కువమంది మధ్యాహ్నానికే ప్రైవేటు వైద్యశాలలకు చెక్కేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో అప్పటి కలెక్టర్ సురేశ్‌కుమార్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాజరు పట్టీల తనిఖీ, మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి వెళ్తున్న వైద్యులను గేటు వద్ద ఆపి హెచ్చరించడం వంటి చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలితం దక్కలేదు. అప్పట్లో ప్రారంభించిన బయోమెట్రిక్ విధానం తూతూమంత్రంగా అమలవుతోంది.



ఇక జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలామంది వైద్యులు జిల్లా కేంద్రం నుంచి వెళ్ళివస్తున్నా రు. వారంలో రెండు మూడు రోజులు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వచ్చినా ఇన్నాళ్లూ పట్టించుకోలేదు.ఉద్యోగులకూ అందని ఉచిత వైద్యసేవలు.. ప్రభుత్వ హెల్త్‌కార్డులున్న ఉద్యోగులకు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలందించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరికోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేయూలని సూచించింది. అయితే మధ్యాహ్నానికే చెక్కేస్తున్న ప్రభుత్వ వైద్యులు దీన్ని పట్టించుకోవటం లేదు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

 

వైద్యుల జాబితా సిద్ధం! .. సొంతంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్న, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల జాబితాను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంటెలిజన్స్ అధికారులు ఈ పనిలో ఉన్నట్టు సమాచారం. ఇందులోభాగంగా జీజీహెచ్, గుంటూరు వైద్యకళాశాలలకు వెళ్లి ప్రభుత్వ వైద్యుల జాబితాను తీసుకున్నారని తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top