‘ఇంటెలిజెన్స్’ బలోపేతం !

‘ఇంటెలిజెన్స్’ బలోపేతం ! - Sakshi


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసేదిశగా రాష్ర్ట ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే డీఎస్పీ పోస్టును కేటాయించిన సర్కార్ కొద్దిరోజుల్లో ఎస్పీ పోస్టు కేటాయించే దిశగా అడుగులు వేస్తోంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్తగా ఎస్పీ పోస్టు రానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ కేవలం డీఎస్పీ పోస్టే ప్రధానంగా కార్యాలయం నడుస్తోంది. సీఐతో పాటు ఎస్‌ఐలు ఇతర సిబ్బంది సమాచార సేకరణలో ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రలో విశాఖ తరువాత శ్రీకాకుళానికి ప్రాధాన్యం పెరుగుతుండడం, రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండడం, రాజకీయ, రాజకీయేతర శక్తులపై నిఘా అవసరం కావడంతో ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఏపీ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలు ప్రత్యేకం కావడం, శ్రీకాకుళానికి కొత్తగా మరో రెండు నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉండడం కూడా ఈ అంశానికి బలం చేకూరుతోంది. అలాగే విశాఖతో పోల్చిచూస్తే ఇక్కడి అవసరాల్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 ఇప్పుడే ఎందుకు?

 ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్రభుత్వానికి నిఘా సంస్థలా పనిచేస్తోంది. వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులు, రాజకీయ నేతల ప్రసంగాలు, ముఖ్య నాయకుల భద్రతపైనా ఇక్కడి ఇంటెలిజెన్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కేవలం ప్రభుత్వం అడిగే వివరాలే కాకుండా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు నిఘా కార్యకలాపాలన్నీ నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేయాల్సిన బాధ్యత ఇక్కడి సిబ్బందిపై ఉంది. అయితే ఇటీవల మాజీ మంత్రి ధర్మానకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని తగ్గించడం, ఈ విషయమై ఆయన పోలీస్‌శాఖకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మావోయిస్టులతో చర్చలు జరిగిన సమయంలో ధర్మాన కూడా ఆ చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు భద్రత అవసరం అని కూడా కోరారు.

 

 ఇందుకు అనుగుణంగా కొన్నాళ్ల క్రితం ఆయన ఇంటి పరిసరాల్లో అనుమానితులు సంచరించడంపైనా ధర్మాన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. అయితే జిల్లాలో ఇలాంటి సంఘటనలే కాకుండా అనేకానేక అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపడం, రహస్యంగా ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ధర్మానకు సంబంధించి జిల్లా పోలీసులు సమాచారం సేకరించినా, ఏ క్షణమైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఈ విభాగానికి అవసరం. దీంతో ప్రస్తుతం ఉన్న డీఎస్పీ పోస్టును బలోపేతం చేసి కొత్తగా ఎస్పీ పోస్టుకు పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అంతే కాకుండా కొత్తగా ఎస్పీ పోస్టు వస్తే ఇంటెలిజెన్స్ విభాగాన్ని రూరల్, అర్బన్ విభాగాలుగా కూడా విభజించే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. శ్రీకాకుళంలోని ఈ విభాగం ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తోంది. వాహనాలు, సిబ్బంది ప్రస్తుతం సరిపడినంతగానే ఉన్నా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రమణమూర్తి కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ముఖ్య కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. అనంతరం ఇక్కడి సీఐనే ఇన్‌చార్జిగా చేశారు. కొత్తగా ఎస్పీ పోస్టు వస్తే ఎస్పీతో పాటు డీఎస్పీల్నీ ఇక్కడ నియమించాల్సిన అవసరం ఉందని సిబ్బంది చెబుతున్నారు.

 

 విశాఖ మాదిరే?

 ఇప్పటివరకూ రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారి (ఆర్‌ఐవో)గా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు విశాఖ కేంద్రంగానే అధికారి పనిచేస్తున్నారు. విశాఖలో నగర పోలీస్ కమిషనరేట్‌ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా అధికారులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ (ఐజీ స్థాయి) పోస్టులో అదనపు డీజీ స్థాయికి పెంచనున్నారు. సీపీ పోస్టుకు జవసత్వాలు చూపించి అదనపు డీజీ స్థాయి పోస్టు వస్తుంది కాబట్టి అక్కడి ఇంటెలిజెన్స్ విభాగ పోస్టునూ ఎస్పీ స్థాయికి (ప్రస్తుతం అదనపు ఎస్పీ పోస్టు ఉంది) కూడా పెంచాలన్నది ఓ ఆలోచన. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీయే పూర్తిస్థాయి పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు.

 

 దీంతో ఇక్కడి ఇంటెలిజెన్స్ విభాగంలోనూ ఎస్పీ స్థాయి పోస్టు ఉంటే ఇద్దరి మధ్య అవినాభావ సంబంధంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంపై నిఘా, రాజకీయ, రాజకీయేతర శక్తులపై విచారణ చేయించేందుకు, పలు సమాచార నివేదికలు సంపాదించేందుకు సులువుగా ఉంటుందనేది అధికారుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు పోస్టు పెంపు, భద్రతా బలగాలపై నివేదికలందించడం వీలయ్యే పని కాదని కూడా అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో జరిగే పెద్ద పెద్ద సంఘటనల కోసం ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న డీఎస్పీ అధికారి సమన్వయంతోనే సిబ్బంది పనిచేస్తే సరిపోతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ధర్మాన విషయంలో కూడా స్థానిక శాంతిభద్రతల పోలీసులే ప్రభుత్వానికి నివేదిక పంపించి ఉంటారని, తమకేమీ అధికారికంగా సమాచారం అందలేదని ఇంటెలిజెన్స్ సిబ్బంది చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top