చీపురుపల్లి లొల్లిపై బాబు ఆరా!

చీపురుపల్లి లొల్లిపై బాబు ఆరా! - Sakshi


సాక్షి ప్రతినిధి, విజయనగరం :చీపురుపల్లి  టీడీపీ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆరాతీస్తున్నారు. అక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఇంటెలిజెన్స్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. ఇప్పుడదే పనిలో ఆ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పలు నివేదికలు ఇచ్చారు. పా ర్టీలో అంతర్గత కుమ్మలాటలెక్కువయ్యాని, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సత్సంబంధాల్లేవని, మంత్రి మృణాళిని స్థానిక నేతలను ఏమాత్రం పట్టిం చుకోవడం లేదన్న ఆరోపణలను సైతం ఇంటెలిజెన్స్ అధికారులు చంద్రబాబుకు నివేదించినట్టు తెలిసింది.

 

 చీపురుపల్లి నియోజక వర్గ పరిస్థితి దా రుణంగా ఉందని, చక్కదిద్దకపోతే రచ్చకెక్కే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు ఆ బాధ్యతలను ఓ మంత్రికి అప్పగించినట్టు తెలిసింది.  చీపురుపల్లిలో పార్టీ వర్గాలను మంత్రి మృణాళిని పట్టించుకోవడం లేదని ఆ పార్టీలో కొందరు నాయకులు బాహాటం గా వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవమివ్వడం లేదని, మండల స్థాయిలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, అధికారుల తో జరిగే సమీక్షలు, సమావేశాలకు స్థానిక సంస్థల ప్రతినిధులను పాల్గోనివ్వడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మండలాల వారీగా నాయకులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని మం త్రి మృణాళిని తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 మంత్రి మృణాళిని విషయం అటుంచితే మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు వ్యవహారం ఆ పార్టీ నేతలకు మరింత మింగుడు పడడం లేదు. తరుచూ పార్టీని తిట్టిపోసి బయటికెళ్లి వస్తున్న గద్దే అంతా తానై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చాలా మంది మధన  పడుతున్నారు. కష్టపడి పనిచేసిన నాయకులను పక్కన పెట్టి ఆయనకే ప్రాధాన్యం ఇస్తున్నారని, దీని వెనుక అధిష్టానం వద్ద ఉన్న లాబీయింగే కారణమని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు వరకు పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న కె.త్రిమూర్తులరాజును దాదాపు విస్మరించారని, ఆయనకు ఏమాత్రం విలువ లేకుండా చేసేశారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ నాయకులు మూడు గ్రూపులగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్నారు.

 

 మండలాల వారీగా గ్రూపులు    

 ఇక, మండలాల వారీగా నాయకులు గ్రూపులు కట్టి పనిచేస్తున్నారు. చీపురుపల్లిలో జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ మధ్య విభేదాల చోటు చేసుకున్నాయి. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల విషయంలో చెలరేగిన మనస్పర్థలు చివరికి ఆధిపత్య పోరుకు దారితీసింది.  ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు తన సత్తా ఏంటో చూపించేందుకు మీసాల వరహాలనాయుడు అనుచరుడైన కర్రోతు రమణను ఏకంగా పార్టీన నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆ ఒక్క మండలంలోనే కాదు దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే తరహా బేదాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇంతజరుగుతున్నా మంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం కూర్చోపెట్టి మాట్లాడే పరిస్థితి లేదని  ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దే  పనిని ఓ మంత్రికి అప్పగించినట్టు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top