మెక్కింది.. కక్కాలి!


 సామాజిక అటవీశాఖలో అక్రమాలపై నేడు

 ఫ్లైయింగ్ స్క్వాడ్ విచారణ

 డీఎఫ్‌వోకు అందిన ఉత్తర్వులు

 రూ.కోట్ల కుంభకోణంపై ‘సాక్షి’ వరుస కథనాలు




ఒంగోలు:  ప్రకాశం జిల్లా సామాజిక అటవీ శాఖలోని అక్రమాలపై గుంటూరు ఆ శాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో ఎల్. భీమయ్య బుధవారం విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు స్థానిక సామాజిక అటవీ శాఖ డీఎఫ్‌వోకు ఉత్తర్వులు అందాయి. నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మెక్కేసిన వైనంపై ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. జిల్లాలోని సామాజిక అటవీ శాఖలో వేళ్లూనుకు పోయిన అవినీతిని బట్టబయలు చేసింది. ఈ నేపథ్యంలో డీఎఫ్‌వో అక్రమాలను విచారించేందుకు బుధవారం  స్థానిక సీఆర్‌పీ క్వార్టర్స్‌లోని అటవీ శాఖ అతిథిగృహంలో విచారణ చేపట్టనున్నారు.


వేటుకు గురైన నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు ఇనగంటి రాజశేఖర్, టంగా సంజీవరావు, షేక్ గౌస్ భాష, బత్తుల బాలశౌరిలను కూడా ఈ విచారణకు సహకరించ వలసిందిగా ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో లేఖలు పంపారు. సామాజిక అటవీ శాఖలోని అక్రమాలు, జిల్లా వ్యాప్తంగా పక్కదారి పట్టిన నిధులు, అధికారుల చేతివాటం అన్న అన్ని అంశాలపై, అన్ని కోణాల్లో సాక్షి కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిలో కొన్ని ఈ ఏడాది జనవరి నెలలో 7వ తేదీన ‘అంతా నా ఇష్టం’, 14న ‘రూ.50 లక్షలు మెక్కేశారు’, 20న ‘పచ్చదనం స్వాహా’, 21న ‘సన్నాయి నొక్కుల్లోనూ అవినీతి ఒప్పుకోలు’, 23న ‘మొక్కల పేరుతో మెక్కేస్తున్నారు’, 31న ‘ఆటవిక రాజ్యం’, ఫిబ్రవరి 7న ‘న్యాయం చేయండి’, 21న ‘నివేదికలో నిజాలేవి’ అన్న శీర్షికలతో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటిపై కూడా విచారణ చేపట్టనున్నారని సమాచారం.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top