ఆ నిధులు అయిన వారికే..!

ఆ నిధులు అయిన వారికే..! - Sakshi


► నిధుల కేటాయింపులో నియంతృత్వం

► వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు అన్యాయం

► అధికార పార్టీ ఎమ్మెల్యేలకే స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌

► మెజార్టీ ఎమ్మెల్యేలకు రెండు విడతలుగా రూ. 4కోట్లు చొప్పున మంజూరు

► తెలుగు తమ్ముళ్లకు ప్రయోజనంగా మారిన పనులు

► ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట ఓడిపోయిన పాలకపక్ష నేతలకు అవకాశం




పథకాల అర్థాలు మారిపోతున్నాయి... నిబంధనలు అపహాస్యమవుతున్నాయి... ప్రజాస్వామ్యం పరిహాసమైంది. చట్టాల అమలు మొత్తం ప్రహసనంగా మారుతోంది. రాష్ట్రంలో పాలన అంతా ఏకపక్షంగా సాగుతోంది. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటే పథకాలు రద్దు చేస్తున్నారు. నిబంధనల మేరకు అందరికీ అందాల్సిన నిధులు కొందరికే అందిస్తున్నారు. ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రతిపక్షంవారైతే... అభివృద్ధి పనులు... నిధులు మంజూరు కావడంలేదు.


చట్టాలను సైతం తమ ఇష్టానుసారం మార్చేసి... ఏకపక్ష నిర్ణయాలతో సాగుతున్న పాలన వల్ల జనం అవస్థలపాలవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పథకం కాస్తా రద్దు చేశారు. ప్రత్యేక అభివృద్ధినిధులు పాలకపక్ష ఎమ్మెల్యేలకు మాత్రమే కేటాయించి... ప్రతిపక్షం ప్రాతినిధ్యం ఉన్నచోట వేరేవారికి అందజేస్తున్నారు.



సాక్షి ప్రతినిధి, విజయనగరం: శాసనసభ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధిపనులకు సాధారణంగా నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) నిధులు మంజూరయ్యేవి. ఎమ్మెల్యేలు తమ కోటా ద్వారా వచ్చే నిధులను అవసరాల మేరకు ఖర్చు పెట్టేవారు. అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటిని అమలు చేసేవి. కానీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధానానికి స్వస్తి పలికారు. అందరికీ నిధులు ఇవ్వడం ఇష్టం లేక సీడీపీకి మంగళం పాడేశారు.


దీనివల్ల ఎమ్మెల్యేలకు సొంతంగా రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. వాటి స్థానంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(ఎస్‌డీఎఫ్‌) పేరుతో నిధులు విడుదల చేస్తున్నారు. స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌పై సీఎంకు పూర్తి విచక్షణాధికారం ఉంది. వాటిని ఎలాగైనా ఖర్చు పెట్టొచ్చు. ఇప్పుడా నిధులను తమ ఎమ్మెల్యేలకు పంచి పెడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఒక్కో ఏడాదికి రూ. రెండేసి కోట్లు చొప్పున తమ ఎమ్మెల్యేలకు కేటాయిస్తున్నారు.


జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి రెండు విడతలుగా రూ. 4కోట్లు వంతున విడుదల చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు మాత్రం రూ. రెండేసి కోట్లు చొప్పున విడుదల చేశారు. వీరికి కూడా రెండో విడతగా రూ. రెండు కోట్లు చొప్పున విడుదల చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చిల్లి గివ్వ కూడా విడుదల చేయకుండా నియంతృత్వ పోకడను చాటుకుంటున్నారు.


ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతలకు పెద్దపీట

ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతలకు ఇప్పటికే ప్రాధాన్యం ఇచ్చారు. సంక్షేమ పథకాలన్నీ ప్రజలచే ఎన్నికైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కాకుండా ఓడిపోయిన తమ పార్టీ నేతల చేత మంజూరు చేయిస్తున్నారు. రుణాలు, ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు... ఇలా ప్రతీదానికీ వారి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేయిస్తున్నారు. ఇప్పుడీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన నేతల పేరుతో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పనుల ప్రతిపాదిత జాబితాను తీసుకున్నట్టు సమాచారం. ఆ జాబితాల ప్రకారం నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.


అనుకూలంగా పనుల పందేరం

మంజూరైన స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌తో చేపట్టే పనులు ప్రతిపాదనల దగ్గరి నుంచి అంచనాలు రూపొందించేవరకు పాలకపక్ష ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. వారు ఏ జాబితాలైతే ఇచ్చారో వాటికే అధికారులు పచ్చజెండా ఊపారు. ఇదే అదనుగా నాయకులు సైతం సొంత లాభం లేనిదే ముందుకెళ్లకూడదనే దోరణికి వెళ్లిపోయారు. ప్రతీదానిలో స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చిందే అవకాశమని స్పెషల్‌డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పనులను టెండర్ల వరకు వెళ్లనీయకుండా తమకు లబ్ధి చేకూరేలా ముక్కలు ముక్కలుగా చేసి చేపడుతున్నారు.


అత్యధిక పనుల విలువ సరాసరి రూ. 10లక్షలకు లోబడి ఉండేలా చూసుకుంటున్నారు. నిబంధనల మేరకైతే రూ. 10లక్షలు పైబడి పనులకు టెండర్లు పిలవాలి. వాటి ద్వారా పారదర్శకత పెరగనుంది. అలా చేస్తే తమకు పనులు దక్కవన్న భయంతో రూ. 10లక్షల లోబడి పనుల్నే ఎంపిక చేసి, నామినేటేడ్‌ పద్ధతిలో కట్టబెడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లబ్ధిపొందుతున్నారు. ప్రతిపాదించిన పనుల్లో దాదాపు సీసీ రోడ్లు, డ్రైనేజీలే ఎక్కువగా ఉన్నాయి. ఇవైతేనే గిట్టుబాటు అవుతాయన్న ఉద్దేశంతో జోరుగా ప్రతిపాదిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top