అసమర్థ పాలన


కర్నూలు విద్య: రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగానే విద్యా శాఖ సమస్యలేవీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబులపతి అన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఓబులపతి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగుల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యంతో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.  సీఎంతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆదాయమే తప్ప.. విద్యాశాఖ అభివృద్ధిపై ఏమాత్రం పట్టదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.

 

  దేశ, రాష్ట్ర అభివృద్ధి విద్యాశాఖతోనే ముడిపడి ఉంటుందనే విషయం బాబు గుర్తుంచుకోవాలన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన ఆయన.. విపక్షాలపై చిందులేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై జాక్టో, ఫ్యాక్టో, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం కరువైందన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఏ హాస్పిటల్‌కు వెళ్లినా తమకెలాంటి ఆదేశాలు లేవని చెబుతున్నారన్నారు.

 

 ఈ కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగులు చికిత్సల కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయలేకపోతోందన్నారు. పాఠశాలల పనివేళలను కోఠారి కమిషన్, విద్యావేత్తలు, మేధావులు నిర్ణయించినవి కాదని.. ప్రభుత్వం ఎలాంటి క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టకనే మార్పు చేసి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను మానసికంగా వేధిస్తోందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పని వేళలు మార్చామంటున్న ప్రభుత్వం.. ఆ చట్టం ప్రకారం స్కూళ్లలో ఎందుకు వసతులు కల్పించడం లేదో సమాధానం చెప్పాలన్నారు.

 

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లన్నీ పరిష్కారమయ్యేవని, అందుకే పాఠశాల విద్యా చరిత్రలో ఎప్పుడు లేనంతగా అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. 60 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని తక్షణమే ప్రకటించి జులై 1, 2013 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.398 వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్స్, జేఎల్ పోస్టులను అడ్‌హాక్ ప్రమోషన్స్‌తో భర్తీ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం స్కూళ్లకు రవాణా సౌకర్యం సక్రమంగా లేదని, ఈ కారణంగా విద్యార్థులు 3 నుంచి 4 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందన్నారు. దీంతో సరైన సమయానికి పాఠశాలకు చేరుకోలేక రోజూ రెండు మూడు పీరియడ్లు కోల్పోతున్నారన్నారు.

 

 హైస్కూళ్లలో భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని ఏపీ వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరప్రసాద్‌రెడ్డి, రమేష్‌లు డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా సోషల్ స్కూల్ అసిస్టెంట్ రెండోపోస్టును మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, కౌన్సెలింగ్ విధానానికి విఘాతం కలిగించేలా ఉన్న అక్రమ బదిలీలను నిలిపివేయాలన్నారు.

 

 ఐటీడీ ఆశ్రమ పాఠశాలల్లోని ఖాళీలను హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్లను జీఓ ఎంఎస్‌నం.3 ప్రకారం ప్రమోషన్లు కల్పించి, 2014 డీఎస్సీలో సీఆర్‌పీలకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలన్నారు. రేషనలైజేషన్, బదిలీలు విద్యా సంవత్సరం మధ్యలో కాకుండా వేసవి సెలవుల్లో చేపట్టాలన్నారు. ధర్నాలో ఏపీవైఎస్సార్‌టీఎఫ్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు తులసిరెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి సుబ్రమణ్యంరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుదర్శన్‌రెడ్డి, ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top