పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం


మచిలీపట్నం : జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు పోర్టులను నిర్మించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, వాటిలో బందరు పోర్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మచిలీపట్నం పోర్టు తమకు అందుబాటులో ఉందని, వెంటనే దానిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇటీవల కేంద్రంతో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో టైటానియం నిక్షేపాలు ఉన్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.



జిల్లావాసుల దాహార్తిని తీర్చేందుకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లతో విజయవాడ నుంచి కరకట్ట వెంబడి మచిలీపట్నం వరకు పైప్‌లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని, ఆ కాంట్రాక్టులను రద్దు చేసి రూ.95 కోట్ల నుంచి రూ.99 కోట్ల అంచనాలతో నూతనంగా డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వివరించారు.



మచిలీపట్నంలో శ్మశానాలు, ఇతర ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అర్హులందరికీ త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలలు పంపిణీ చేస్తామని, గృహాలు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 80 రోజులు గడిచిందని, పారదర్శకమైన పాలనను అందిస్తున్నామన్నారు.



విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేయటం జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసే దిశగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీసీ సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు, చేనేత రుణమాఫీకి రూ.500 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ కాశీవిశ్వనాథం పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top