‘ఇందిరమ్మ’ బకాయి..రూ.14 కోట్లు


శ్రీకాకుళం పాత బస్టాండ్: పేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ పథకం ఆర్థిక ఇబ్బందులతో చతికిలపడింది. ఈ పథకం కింద ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి ఇంకా అనుమతులే రాలేదు సరి కదా.. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఇళ్లకు రూ. 14 కోట్ల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఫలితంగా చాలా ఇళ్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. గతంలో లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మించినా.. సకాలంలో వెంటవెంటనే బిల్లులు చెల్లించేసే పరిస్థితి ఉండేది. 2009 నుంచి పరిస్థితి మారిపోయింది.

 

లబ్ధిదారుల ఎంపికతో మొదలై  ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు వరకు.. ప్రతి దశలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండటంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి ప్రభుత్వం మంజూరు చేసిన దాని కంటే నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో లబ్ధిదారులు అప్పులపాలై నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కారణంతో గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరకపోగా.. నిర్మించిన వాటికి బిల్లులు కూడా నిలిచిపోయాయి. గృహనిర్మాణ సంస్థ అధికారులు బిల్లులను ఆన్‌లైన్‌లో పంపించినా ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదు.

 

గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో జిల్లాలో 23 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించగా 17 వేల నిర్మాణాలే జరిగాయి. వీటిలోనూ 1975 మందికి చెందిన సుమారు రూ. 14 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి.  ఇక ప్రస్తుతం సంత్సరానికి(2014-2015) జిల్లాలో 20 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇంతవరకు అటునుంచి అనుమతులు రాలేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు.

 

దీనికి తోడు ఇళ్ల మంజూరుకు ఇన్‌చార్జి మంత్రితోపాటు, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి ఉండాలన్న నిబంధన కారణంగా ఇవన్నీ జరిగేసరికి చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం, అధికార పార్టీ మారడంతో ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం పెరిగే అవకాశం కూడా ఉంది.  ఇటీవల కాలంలో భవన నిర్మాణ సామగ్రి,  కూలీల రేట్లు, ఇతర ఖర్చులు పెరగడంతో ఇంటి నిర్మాణ బడ్జెట్ బాగా పెరిగిపోయింది. నిధుల సమీకరణకు బయట అప్పులు చేయాల్సి వస్తోంది. ఇవి చాలవన్నట్లు బిల్లుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ఆ అప్పులపై వడ్డీలు తలకు మించిన భారంగా మారడంతో ఇంటి నిర్మాణమంటేనే పేదలు భయపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top