జులుం


 బద్వేలు అర్బన్: ఇందిర క్రాంతి పథం(ఐకేపీ)లో వెట్టిచాకిరీ చేస్తున్న యానిమేటర్లపై  పోలీసులు  జులుం చూపారు.  తమకు రావాల్సిన 19నెలల వేతనాలకోసం సోమవారం నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రపడగా ఇందుకు పోలీసుయంత్రాంగం పూర్తి  సహకారం అందించింది. జిల్లాలో అనేక చోట్ల యానిమేటర్లను ముందస్తుగా అరెస్టుచేశారు. ఇప్పటికే హైదరాబాద్ వెళ్లిన యానిమేటర్లకు ఫోన్లు చేస్తూ తిరిగి రాకుంటే కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామని  హెచ్చరిస్తున్నట్లు సమాచారం. యానిమేటర్లకు 19 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు.  

 

  ఫలితంగా జిల్లాలోని 1400 మంది  యానిమేటర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.  ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్ నెల నుంచి సమ్మెబాటలోకి వెళ్లారు.  వీరు గ్రామ సమాఖ్యలను బలోపేతం చేస్తూ వాటి దైనందిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. గ్రూపులకు రుణాలు ఇప్పించడం మొదలు వాటిని వసూలు చేసే బాధ్యత వీరిదే.  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలవద్దకు చేర్చేందుకు వారధిగా పనిచేస్తుంటారు. కులగణన, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలను గుర్తించి ప్రభుత్వ ప్రోత్సాహకాలకు ఎంపిక చేయడం వంటి అదనపు పనులను అధికారులు వీరిపైనే రుద్దుతుంటారు.

 

  ఇంతచేస్తున్నా వీరికి అరకొర వేతనమే అందుతోంది. గతంలో నిర్వహించిన ఆందోళనల ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం 2013 జూన్‌లో రూ.3500ల వేతనం చెల్లించేందుకు అంగీకరించి ఆ మేరకు జీవో విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వం నుంచి రూ.2000 గ్రామ సమైక్య సంఘం నుంచి రూ.1500 చెల్లిస్తామని  పేర్కొంది.ఈ మేరకు రెండు నెలలు మాత్రమే వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం మానేసింది. ఇందులో కూడా జిల్లాలో 1187 మందికి  జీతాలు మంజూరు కాగా  ఏపీఎంలు, సీసీల అలసత్వం కారణంగా ఆయా మండలాలలోని సుమారు 262 మందికి రెండునెలల వేతనాలు కూడా అందలేదు. ఈ క్రమంలో ప్రభుత్వంపై  పోరాడేందుకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు.

 

 ఎక్కడికక్కడ అరెస్టులు :  యానిమేటర్ల ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ప్రభుత్వం పన్నిన కుట్రకు పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించారు.  జిల్లాలోని బద్వేలు, కలసపాడు, రామాపురం, ఎల్.ఆర్.పల్లె, బి.మఠం, సుండుపల్లె, సంబేపల్లి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగుతో పాటు మరికొన్ని ప్రాంతాలలో యానిమేటర్లను ముందస్తుగా అరెస్టు చేసినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.  యానిమేటర్ల ఇళ్లవద్దకు పోలీసులు వెళ్లి ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీచేస్తూ అరెస్టు చేస్తున్నారు. అలాగే బద్వేలు పరిధిలోని  యానిమేటర్లను  స్టేషన్‌కు తరలించి నిర్బంధించడంతో వెలుగు ఏపీఎం, ఏసీవోలు  స్థానిక  పోలీసులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్‌కు చేరుకున్న యానిమేటర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌కు సైతం  పోలీసులు ఫోన్లు చేసి వెనక్కు రావాల్సిందిగా హెచ్చరించినట్లు తెలిసింది.

 పోలీసులతో మాట్లాడిన పీడీ : జిల్లాలో సమ్మెలోలేని యానిమేటర్లను సైతం పోలీసులు అరెస్టు చేయడంతో డీఆర్‌డీఏ  పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, వివిధ స్టేషన్ల సీఐలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు వెళ్లని యానిమేటర్లను అరెస్టు చేయడం సరికాదని పోలీసులతో తెలిపినట్లు సమాచారం. తక్షణమే ఏపీఎంల పూచికత్తుతో వారిని విడుదలచేయాలని కోరినట్లు  తెలుస్తోంది.

 

 ప్రభుత్వ పతనం ఖాయం: న్యాయమైన కోర్కెల సాధన కోసం, 19 నెలల వేతనాల కోసం శాంతియుతంగా ఆందోళనకు సిద్ధమైన యానిమేటర్లను  అరెస్టు చేయించడం దారుణం. య్రానిమేటర్ల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోగా వారిని అనేక రకాల ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.     

 -చంద్రశేఖర్, వీఓఏల సంఘం జిల్లా కార్యదర్శి         

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top