ఇంకెంతకాలం ఈ ఆకలి కేకలు!


  • వీవోఏల నిరసనలు

  •  15నెలలుగా అందని గౌరవ వేతనం

  •  పట్టించుకోని అధికారులు

  • నూజివీడు : ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ (యాని మేటర్లు)పరిస్థితి దారుణంగా తయారైంది. నెలనెలా చెల్లించాల్సిన గౌరవ వేతనాలను సంవత్సరాల  తరబడి చెల్లించకుండా జాప్యం చేస్తుండటంతో వారు  పడరాని పాట్లు పడుతున్నారు. 15 నెలలుగా గౌరవ వేతనాల కోసం ఎదురుచూస్తూ అప్పులు చేసి జీవనాన్ని సాగిస్తున్నా... పాలకులు మాత్రం దయచూపడం లేదు.  జిల్లాలో దాదాపు 2165మంది వీవోఏలు ఐకేపీలో పనిచేస్తున్నారు.  వీరికి నెలకు రూ.2వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తామని గతేడాది ప్రభుత్వం జీవో విడుదల చేసి, అదే ఏడాది జూన్, జూలై నెలకు రూ.2వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించింది.



    2013 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు గౌరవ వేతనాలను చెల్లించలేదు. దీంతో నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వీవోఏలు సమ్మెకు దిగి మండలాల్లోని ఐకేపీ కార్యాలయాల వద్ద రిలేదీక్షలు నిర్వహిస్తున్నారు. 30నుంచి 40డ్వాక్రా సంఘాలకొక వీవోఏను నియమించారు. వీరు ఆయా గ్రూపులకు సంబంధించిన పొదుపు వివరాలను, తీసుకున్న రుణాల వివరాలను మొబైల్ ద్వారా సెర్ఫ్‌కు పంపుతారు.  



    అంతేగాకుండా ‘బంగారుతల్లి’ పథకానికి వివరాల సేకరణ, అభయహస్తం, ఆమ్‌ఆద్మీబీమాయోజన, జనశ్రీబీమా యోజన, వికలాంగుల గ్రూపు  వివరాలు తదితర బాధ్యతలన్నీ వీవోఏలే నిర్వహిస్తుంటారు. అలాగే  స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన పుస్తకాలు రాస్తున్నందున ప్రతి గ్రూపు నెలకు రూ.50 చొప్పున వీవోఏలకు చెల్లించాలని సెర్ఫ్ ఉన్నతాధికారులు సూచించినా... ఇదీ అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     

    భారమంతా వీవోఏలపైనే

     ఏ పథకం ప్రవేశపెట్టినా సమస్త సమాచారమంతా సేకరించాలని వీవోఏలకే అప్పగిస్తున్నారు. బాధ్యతలు అప్పగించినంతగా గౌరవ వేతనాన్ని చెల్లించడం లేదు. గ్రామంలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా వివరాలు పంపాల్సి వస్తోంది. స్కాలర్‌షిప్పులనూ మేమే పంపిణీ చేస్తున్నాం.

     - వజ్జా వీణ, సీతారామపురం

     

     రాజకీయ వేధింపులు ఆపాలి

     వీవోఏలపై ఇటీవల కాలంలో రాజకీయ వేధింపులు అధికమయ్యాయి. ఈ వేధింపులను నిలువరించాలి. వీవోఏల బాధ్యతల నుంచి ఇప్పుడు పనిచేస్తున్న వారిని తొలగిం చాలని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటివి రాకుండా చూడాలి.

     - తులిమెల్లి టారీస్, పాతరావిచర్ల

     

     నెలనెలా ఇవ్వాలి

     నెలానెలా గౌరవ వేతనాన్ని చెల్లించాలి.  ఇన్ని నెలలు గౌరవ వేతనం చెల్లించకపోతే ఎలా. ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని నెలల పాటు జీతాలు లేకుండా పనిచేస్తారా? ఒకవైపు ధరలు పెరిగి ఖర్చులు పెరుగుతున్నందున మాకు రావాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.

     - బండి నాగమణి, యనమదల

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top