నరకం అలానే ఉంటుందేమో?

కుటుంబ సభ్యులతో డాక్టర్‌ రామ్మూర్తి - Sakshi


18 నెలల ఉగ్రవాదుల చెర అనంతరం ఏలూరు చేరుకున్న రామ్మూర్తి

తిరిగి వస్తాననే ఆశ చచ్చిపోయింది

ఎయిర్‌పోర్టులో ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు

కాల్పుల్లో మూడు తూటాలు తగిలాయి

మణికట్టులో బుల్లెట్‌ అలాగే ఉంది

రామ్మూర్తిని చూసి ఉద్విగ్నతకు లోనైన భార్య, కుమారుడు, కుమార్తె




సాక్షి ప్రతినిధి, ఏలూరు: చుట్టూ రాక్షసుల్లాంటి ఉగ్రవాదులు. ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియదు. తన ఎదుటే ఇతర బందీలను చిత్రహింసలకు గురి చేసి క్రూరత్వం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించారు. ప్రాణాలతో బయటపడతానని ఆశలేదు. తానే డాక్టర్‌ అయినా అనారోగ్యానికి వైద్యం చేసుకోలేని పరిస్థితిలో 18 నెలల పాటు లిబియాలో ఐసిస్‌ ఉగ్రవాదుల చెరలో గడిపారు డాక్టర్‌ కొసనం రామ్మూర్తి. భారత ప్రభుత్వం చొరవతో బయటపడ్డ ఆయన.. ఆదివారం ఏలూరులోని తన స్వగృహానికి చేరారు. భర్త రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన రామ్మూర్తి భార్య అన్నపూర్ణ భవాని, కుమారుడు పవన్‌కుమార్, కుమార్తె నిదిషా ఆయనను చూడగానే ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆనందభాష్పాలతో ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు.


అనంతరం రామ్మూర్తి్త మీడియాతో మాట్లాడారు. ‘ఐసిస్‌ ఉగ్రవాదుల చెరలో ఏడాదిన్నర పాటు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూశాను. అసలు ఇండియాకు తిరిగి వస్తాననే ఆశ కూడా చచ్చిపోయింది. క్షణమొక యుగంగా గడిచింది’అని డాక్టర్‌ రామమూర్తి చెప్పారు. లిబియాలో వైద్యుడిగా పనిచేస్తున్న ఆయనను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన విషయం విదితమే. 2015 సెప్టెంబర్‌లో తాను ఇండియాకు తిరిగి వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకోగా తీవ్రవాదులు అపహరించారని చెప్పారు. అక్కడి ఉగ్రవాదులకు వైద్య సేవలు అందించాలంటూ తనను బంధించారన్నారు.


ఆ తర్వాత తీవ్రవాదులతో అక్కడి సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో తనకు మూడు తూటాలు తగిలాయన్నారు. దీంతో తనను సిర్త్‌కు తరలించి చికిత్స జరిపారని, ఎడమ చేతి మణికట్టులో దిగిన బుల్లెట్‌ను వైద్యులు అలానే ఉంచేశారని వివరించారు. ఇటీవల తాను బందీగా ఉన్న ప్రాంతాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుందని, మిలిటరీ అధికారులకు తన గోడు వెళ్లబోసుకోగా.. వారు భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారని వివరించారు. భారత రాయబార కార్యాలయ అధికారులకు తన వివరాలు చెప్పగా, వారు వెంటనే స్పందించి తనను విడిపించారని చెప్పారు. భారత్‌కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఈ నెల 25న ఢిల్లీలో అడుగుపెట్టానని వెల్లడించారు.



తిండి.. మందులూ కరువే
తీవ్రవాదుల చెరలో ఉన్న కాలంలో సరైన ఆహారం, అనారోగ్యానికి మందులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డానని రామ్మూర్తి తెలిపారు. బుల్లెట్‌ గాయం మానేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్‌ కూడా లేకపోవడంతో నరకం అనుభవించానని వాపోయారు. రామ్మూర్తి్తని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పరామర్శించారు.

ఆయనకు పునర్జన్మ
మా వారు కిడ్నాప్‌ అయ్యారని తెలిసినప్పటి నుంచి ఎన్నో రకాల భయాలు నన్ను ఆవహించాయి. తీవ్రవాదుల అరాచకాలు, ఘోరాలు తలుచుకుని గుండెలవిసిపోయేవి. నెలలు దాటిపోతున్నా ఎటువంటి సమాచారం అందకపోవడంతో కీడు శంకించింది. ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం బాధలు పడుతున్నారు, తీవ్రవాదులు ఆయన్ను ఏం బాధలు పెడుతున్నారో అంటూ అనుక్షణం మథనపడ్డాను. ఎట్టకేలకు ఆయన క్షేమంగా భారత్‌కు తిరిగి వస్తున్నారనే సమాచారం నాకు ప్రాణం పోసింది. నేను నమ్ముకున్న దేవుళ్లు ఆయన్ను చల్లగా చూశారు. ఆయనకు పునర్జన్మ ఇచ్చారు. మా అందరినీ కాపాడారు. – అన్నపూర్ణ భవాని, రామ్మూర్తి భార్య
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top