స్వచ్ఛ భారత్‌కు తూట్లు


సాక్షి ప్రతినిధి, విజయనగరం: సర్కార్ ప్రకటనలకు, ఆచరణకు ఎక్కడా పొంతన ఉండటం లేదు.  స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నెరవేరకుండా రాష్ట్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది. వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రజల్లో చైతన్యం రావడం లేదని, అవగాహన కొరవడిందని  సాకులు చెప్పడమే తప్ప తనవంతు సాయాన్ని సకాలంలో అందించడం లేదు. స్వచ్ఛ భారత్ కోసం ఒకవైపు కేంద్రప్రభుత్వం  భారీఎత్తున నిధులు విడుదల చేస్తోంది. జిల్లాలకొచ్చేసరికి ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సక్రమంగా రావడం లేదు. దీంతో లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు జరగడం లేదు.   పేదరికంతో సతమతమయ్యే బడుగులు అప్పులు చేసి మరుగుదొడ్లు నిర్మించుకోలేకపోతున్నారు. నిర్మించిన వారికే బిల్లులు రాలేదని మరికొందరు వెనుకంజ వేస్తున్నారు. ఇందులో అధికారుల తప్పిదాలు ఉన్నాయి. దరఖాస్తుల అప్‌లోడ్, జియో ట్యాగింగ్ జాప్యం కూడా ఆ పథకానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి.

 

 లక్ష్యం 50 వేలు: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల 24 వేల కుటుంబాల్లో  18 లక్షల 53 వేల మంది సభ్యులున్నారు.  ఈ ఏడాది 50వేల మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించింది. ఇంతవరకు 16,412మాత్రమే నిర్మాణాలకు నోచుకున్నాయి. ఇందులో 10,174మందికి మాత్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఇందులో నాలుగో వంతు మందికి యూనిట్ ఖరీదు రూ.15వేలలో తొలి విడత బిల్లు(6వేలు)లే అందాయి. ఇక,  మిగతా 6,238 మందికి కనీసం చెల్లింపులు జరగలేదు.   సుమారు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎప్పుడొస్తాయో అధికారులే చెప్పలేకపోతున్నారు. మరో రెండు వేల వరకు నిర్మాణాలు జరిగినా జియో ట్యాగింగ్ జరగకపోవడంతో బిల్లులకు నోచుకోలేదు.

 

 మున్సిపాల్టీల్లో నత్తనడక...

 మున్సిపాల్టీల్లో పరిస్థితి విచిత్రకరంగా ఉంది. మరుగుదొడ్లు నిర్మించుకుంటామని ముందుకొచ్చిన  లబ్ధిదారులు దరఖాస్తుల అప్‌లోడే జరగడం లేదు. దాదాపు 23,283దరఖాస్తులు రాగా అందులో 15,236 దరఖాస్తులను మాత్రమే అప్‌లోడ్ చేశారు. వాటిలో 11,024దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. అందులో జియో ట్యాగింగ్ జరిగిన లబ్ధిదారుల సంఖ్య వెయ్యి లోపే ఉంది. చెల్లింపులైతే 400మందికి మించి జరగలేదు.  దీన్నిబట్టి మున్సిపాల్టీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఎంత దారుణంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రభుత్వం మంజూరు చేసే యూనిట్ ఖరీదు రూ.15 వేలు ఎటూ సరిపోదు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలంటే అంతకు రెండింతలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరుగుదొడ్లు అవసరమన్న ఉద్దేశంతో ప్రభుత్వమిచ్చిన దానికి మరికొంత అప్పు చేసి కలిపి నిర్మాణాలు చేపడుతున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో మ ద్యలోనే నిలిపేస్తున్నారు. బిల్లుల విషయమై ప్రశ్నిస్తే  తమకు సమాచారం ఉండదని, నిధులొస్తే నేరుగా బ్యాంకు ఖాతాలోనే పడతాయని అధికారులు చేతులేత్తేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోతే వ్యక్తిగత మరుగుదొడ్లు లక్ష్యానికి తూట్లు పడ్డట్టే.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top