నల్లధనం వెలికితీస్తేనే దేశాభివృద్ధి

నల్లధనం వెలికితీస్తేనే దేశాభివృద్ధి - Sakshi


 శ్రీకాకుళం అర్బన్ : నల్లధనం వెలికితీతతోనే భారతదే శం అభివృద్ధి చెందుతుందని పలువురు రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు అన్నారు. సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ‘దేశ భవిష్యత్తు-నల్లధనం పాత్ర’ అనే అంశంపై బుధవారం స్థానిక సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో అనేకమంది నల్లధనం దాచారని, ఇది దేశ ద్రోహం అన్నారు. దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ధనాన్ని విదేశీ బ్యాంకుల్లో దాయడం నేరమన్నారు. సాధారణ ఎన్నికలు, వివిధ రంగాలను ఈ నల్లధనం భ్రష్టుపట్టిస్తోందన్నారు.

 

 ఈ మేరకు ప్రజలను చైతన్య పరచాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ నల్లధనం వెలికితీత ఒక్కరోజులో సాధ్య పడేది కాదని, అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉందని అన్నారు. నల్లధనాన్ని వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. నల్లధనం వెలికితీత అత్యున్నత న్యాయస్థానంతో ముడిపడిన అంశమని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు అన్నారు. నల్లధనం కలిగిన వారి సంఖ్య దేశంలో 627గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోందన్నారు. దీనిలో ఇప్పటికే ఎనిమిది మంది పేర్లు బయటపడ్డాయన్నారు.

 

 మిగతావారి పేర్లను కూడా బయటపెట్టి నల్లధనం వెలికి తీయాలని కోరారు.  విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ నల్లధనం వెలికితీత చాలా సున్నిత అంశమన్నారు. ప్రభుత్వాలు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడం, చట్టా లు సమర్థవంతంగా అమలు కాకపోవడంతో నల్ల కుబేరులు అధికమయ్యారన్నారు. నల్లధనం వెలికితీతలో ఏవైనా అడ్డంకులు వస్తేవాటిని సుప్రీంకోర్టు చూసుకుంటుందని స్వయంగా ప్రకటించిందన్నారు. నల్లధనం వల్ల యువత నిర్వీర్యమవుతోందని ఫోరం అధ్యక్షుడు కామేశ్వరరావు అన్నారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు, ఫోరం ప్రతినిధులు ఏవీటీ అప్పారావు, ఎన్.రమణయ్య, ముఖేష్ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top