విశాఖ ఖ్యాతి ఇనుమడించేలా స్వాతంత్య్ర దిన వేడుకలు

విశాఖ ఖ్యాతి ఇనుమడించేలా  స్వాతంత్య్ర దిన వేడుకలు


మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాట్లు పరిశీలన

 


మహారాణిపేట(విశాఖ) : విశాఖ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేలా ఈసారి స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం తొలిసారిగా స్వాతంత్య్రదిన వేడుకలను విశాఖలో నిర్వహిస్తున్నందున నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లుపై మంత్రి గురువారం బీచ్‌రోడ్‌లో కలెక్టర్ యువరాజ్, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. వేడుకలకు సంబంధించి వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు, పోలీస్ పరేడ్, జెండావందనం, కవాతు, రాష్ట్రప్రగతిని ఇనుమడింప చేసేలా ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసే శకటాలు తిరిగే ఏరియాలను పరిశీలించారు.



‘విశ్వప్రియ’ వద్ద వేదిక

 విశ్వప్రియా ఫంక్షన్‌హాల్ దగ్గరున్న డైనోసర్ బొమ్మల వద్ద వేదిక ఏర్పాటు చేస్తామని దానికి ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై జాతీయజెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ యువరాజ్ తెలిపారు. వేదికకు ఇరువైపులా ప్రజలు కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బీచ్‌లో బొమ్మలకు ఎలాంటి నష్టం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 16 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 16 విభాగాలవారు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి శకటాలు ప్రదర్శిస్తామన్నారు. పాండురంగస్వామి ఆలయం మీదుగా సీఎం కాన్వాయ్ వచ్చేందుకు రూట్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. 25 నిమిషాల పాటు పరేడ్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, అధికారులు వస్తున్నందున ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు. తీవ్రవాదులు ప్రభావంతో దేశంలో హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అమిత్‌గార్గ్‌కు సూచించారు.  ఏసీపీ కె.ప్రభాకర్, జీవీఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top