సభలో అసభ్య మాటలా?

సభలో అసభ్య మాటలా? - Sakshi


టీడీపీ సభ్యులపై చెవిరెడ్డి ఆగ్రహం

 

హైదరాబాద్: శాసనసభ వేదికగా తనను అసభ్య పదజాలంతో దూషించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల అంశంపై సభలో చర్చకు  పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి చర్చ జరగాలని నినదిస్తున్న సమయంలో ప్రతిగా అధికార పక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. స్పీకర్ అనుమతితో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయగా, అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడానికి ఉపక్రమించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో చెవిరెడ్డి ప్లకార్డుతో పోడియం వద్ద తన నిరసన తెలియజేస్తుండగా, అధికార పక్షం సభ్యులు కొందరు.. అసభ్య పదజాలంతో.. కెమెరాకు అడ్డంగా ఉన్నావు... తప్పుకో అంటూ ఆయన్నుద్దేశించి గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో ఇరుపక్షాల వాగ్వాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి తలెత్తింది. ప్లకార్డు ప్రదర్శిస్తున్న తనపై అసభ్య పదజాలంతో దూషించమేంటని భాస్కర్‌రెడ్డి ఆగ్రహం ప్రదర్శించారు.



మీరు టీవీల్లో కనిపించడానికి ఈ రకంగా అసభ్య పదజాలంతో దూషిస్తారా అని మండిపడ్డారు. ఆ సమయంలో సభ్యుల మధ్య పరస్పరం వాగ్యుద్ధం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సభ్యులు సర్దిజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. శాంతి భద్రతల అంశంపై సభలో చర్చ జరగాలని ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిర సనను వ్యక్తం చేస్తుంటే తోటి సభ్యుడన్న గౌరవం లేకుండా టీడీపీ సభ్యులు తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి విషయాల్లో స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యుల హక్కులను కాపాడాలని చెవిరెడ్డి మీడియాముందు పేర్కొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top