కర్షకుడిపై జీఎస్టీ కత్తి

కర్షకుడిపై జీఎస్టీ కత్తి - Sakshi


► 18 శాతం మేర పెరగనున్న పురుగు మందుల ధరలు

► ఆందోళనలో అన్నదాత




ములకలచెరువు: రైతుల సంక్షేమమే తమ ద్యేయమని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నడ్డి విరుస్తున్నాయని అన్నదాతలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పండిన పంటలకు గిట్టుభాటు ధరలు లేక నష్టపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం తీసుకొస్తున్న జీఎస్టీ( వస్తు సేవా పన్ను) పన్ను విధానం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాగా మారనుంది. 18 శాతం మేర పురుగు మందులు, ఎరువు పెరగనుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.



జీఎస్టీతో పురుగు మందులు భారం:

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో పురుగు మందులపై 18 శాతం పన్ను భారం మోపనుంది. జూలై 1 నుంచి ధరలు పెరనుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వివిధ కంపెనీలు ధరలు పెంచేశాయి. యూరియాతో పాటు జింకు, మెగ్నీషియం, బయో ఫర్టిలైజర్స్‌పై ఐదు శాతం ధరలు పెరగనున్నాయి. పురుగు మందులపై 18 శాతం పెంపు తప్పని సరిగా మారింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఖరీఫ్‌లో సుమారుగా 70 వేల హెక్టార్లలో పంటలు సాగుచేస్తారు. యూరియా, డీఏపీతో పాటు కాంప్లెక్స్‌ ఎరువులు వాడుతారు.



వీటితో పాటు పురుగుల మందులు సైతం వాడుతారు. ఈ నేపథ్యంలో ధరల పెంపు రైతులకు అదనపు భారం కానుంది. జీఎస్టీతో ఎరువుల కంపెనీలు ధరలు అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం యూరియా బస్తా రూ.298 ఉండగా జీఎస్టీతో జూలై 1 నుంచి 315కు పెరగనుంది. అలాగే డీఏపీ రూ.1155 నుంచి రూ. 1217కు పెరగనుంది. పెరిగిన ధరలతో నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు కోట్ల రూపాయలు అన్నదాతలపై భారం పడనుంది. పండిన పంటలకు గిట్టుభాటు ధరలు లేక పెట్టుబడులు దక్కక రైతులు నష్టపోతున్నారు. గిట్టుభాటు ధరలు కల్పించని ప్రభుత్వం ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు. ఇలాగైతే కాడి వదిలేయాల్సిందేనని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.



రైతులపై అధనపు భారం

ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచడం రైతులపై అదనపు భారం మోపడమే. సాగు ఖర్చులు పెరిగితే వ్యయం మరింత భారమవుతుంది. పండించిన పంట పెట్టుబడులకే సరిపోతుంది.

                                - శంకర్‌రెడ్డి, రైతు, వేపూరికోట.



ఇదెక్కడి న్యాయం

రైతులు పండించిన పంటకు గిట్టుభాటు ధరలు కల్పించని ప్రభుత్వాలు ఎరువు, పురుగుల మందుల ధరలు పెంచడం దారుణం. దేశానికి వెన్నెముక వంటి రైతులపై భారం మోపడం తగదు. జీఎస్టీ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలి.



                                               - అంజనప్ప, రైతుసంఘం నాయకుడు, ములకలచెరువు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top