పట్టణ ప్రజలపై భారం


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆదాయం కోసం పట్టణ ప్రజలపై భారాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్థలాల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఒంగోలు కార్పొరేషన్, చీరాల మున్సిపాలిటీల్లో భూముల విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపుదల 50 నుంచి వంద శాతం వరకూ ఉంటుంది. తద్వారా ఐదు శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.



{పభుత్వ విలువ కాకుండా బయట మార్కెట్‌లో భూముల విలువ ఎంత ఉందో గుర్తించి దాని ఆధారంగా భూముల విలువలను నిర్ణయించనున్నారు. పెంచిన విలువలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి.



ఇప్పటికే ఒంగోలు, చీరాల పట్టణాల్లో భూముల పెరుగుదల ఏ ప్రాంతాల్లో ఉందో గుర్తించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అర్బన్ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా లాండ్ కన్వర్షన్ చేసిన వాటిని కూడా గుర్తించనున్నారు.



రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని వస్తుందనే భావనతో ధరలు భారీగా పెరగడంతో  ఇక్కడ భూముల ధరలను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు మార్కెట్ విలువలు ఎంత ఉన్నాయన్న సమాచారం సేకరించారు. బహిరంగ మార్కెట్ విలువకు దగ్గరగా ప్రభుత్వ విలువలు ఉండేలా ఈ పెంపుదల ఉండబోతోంది.



అధికారులు తమ ప్రతిపాదనలను ఈ నెల 27లోగా సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్లకు అందజేయనున్నారు. వారు వీటిని చర్చించి ఆమోదించిన తర్వాత ఆగస్టు ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఒంగోలు నగరంలో భూముల విలువల పెంపుదల వంద శాతం వరకూ ఉండవచ్చని సమాచారం.



ఒకవైపు రాజధాని విషయంలోనూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేటాయిస్తోన్న విద్యాసంస్థల విషయంలో జిల్లాపై పూర్తి అశ్రద్ధ చూపుతున్న రాష్ర్ట ప్రభుత్వం భూముల ధరలు పెంచాలన్న నిర్ణయం తీసుకోనుండటం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top