రాజధాని జోన్‌పై ‘ఐ’టీ

రాజధాని జోన్‌పై ‘ఐ’టీ - Sakshi


* రూ. కోట్లలో భూముల లావాదేవీల వివరాల సేకరణ

* పూర్తి వివరాలు లభ్యమయ్యాక ఆదాయ పన్ను వసూళ్లు చేసే యోచన

* రంగంలోకి రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్



సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని జోన్ వ్యవహారం మొత్తం భూమి చుట్టూ తిరుగుతోంది. సమీకరణ పేరుతో ప్రభుత్వం తమ భూములు లాగేసుకుని మళ్లీ ఇస్తుందో, ఇవ్వదో అనే ఆందోళనతో చాలా మంది రైతులు తమ పొలాలను బేరానికి పెడుతున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ ప్రాంతాల కుబేరులు, రియల్ వ్యాపారులు రాజధాని జోన్‌లో భూమి కోసం ఎగబడుతున్నారు. ఈ భూ లావాదేవీల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి.



తుళ్లూరుపై రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ శాఖలు ఇప్పటికే దృష్టి సారించాయి. రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను శాఖ కూడా రాజధాని జోన్‌లో వ్యాపార లావాదేవీల మీద కన్నేసింది. తుళ్లూరు తదితర ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలతో కోట్లాది రూపాయలు చేతులు మారడంతో ఆదాయ పన్ను వసూళ్లకు ఐటీ శాఖ సిద్ధమవుతోంది. గ్రామాల వారీగా భూ క్రయవిక్రయాలపై రిజిస్ట్రార్ కార్యాలయం, రెవెన్యూ శాఖల నుంచి సమాచారం సేకరించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. భూ లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందాక పన్ను వసూలు కోసం రంగంలోకి దిగే ఆలోచన చేస్తున్నారు.



‘సమీకరణ’ భూములపై విజిలెన్స్ ఆరా...

రాజధాని జోన్‌లో భూముల లావాదేవీలు, లొసుగులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 21న గుంటూరు వచ్చిన విజిలెన్స్ డీజీపీ టి.పి.దాసు భూ లావాదేవీలపై దృష్టి సారించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల విజిలెన్స్ ఎస్‌పీలను ఆదేశించారు. రెండు రోజులుగా రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు రాజధాని జోన్ పరిధిలోని 29 గ్రామాల్లో భూముల మారకంపైనా.. ల్యాండ్ పూలింగ్‌కు అనుకూల, వ్యతిరేక సమీకరణలపైనా వివరాలు సేక రిస్తోంది. భూముల క్రయవిక్రయాలపై కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేక, అనుకూల పరిస్థితులను ఆరా తీసి ఉన్నతాధికారులను నివేదించడం కోసమే తుళ్లూరు మీద కన్ను వేశామని విజిలెన్స్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. భూ లావాదేవీల్లో అక్రమాలకు చోటు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ శాఖ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top