రూల్స్ కొండెక్కిద్దాం..!

రూల్స్ కొండెక్కిద్దాం..! - Sakshi


నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ పెద్దలు

కుదరదంటున్న కేంద్ర అటవీ శాఖ

యాజమాన్య హక్కుల కోసం రాష్ర్ట సర్కారు ఒత్తిడి

రెండు కొండలపై హక్కుల కోసం పట్టు


 

అస్మదీయులకు కొండలను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు  కేంద్ర అటవీమంత్రిత్వ శాఖతో ఢీ అంటూ ఢీ అంటున్నారు.  నగరంలోని రెండు కొండలను పీపీపీ విధానంలో తమవారికి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. వాటిని డీనోటిఫై చేయడంతోపాటు యాజమాన్య హక్కు బదలాయించాలని పట్టుబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను సమ్మతించమని కేంద్ర అటవీమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దాంతో ప్రభుత్వ పెద్దలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చి మరీ తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

 

విశాఖపట్నం :  నగరంలోని 3,071 ఎకరాల విస్తీర్ణంలోని కొండలను దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. పర్యాటక ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ పేరుతో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ కొండలను అస్మదీయులకు కట్టబెట్టాలని ఎత్తగడ వేశారు. ఇవి రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండటంతో వారి గొంతులో వెలక్కాయపడింది. దాంతో  డీనోటిఫై  చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. యాజమాన్య హక్కును బదలాయిస్తూ డీనోటిఫై చేయాలని ప్రతిపాదించింది. అలా అయితే ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టవచ్చని భావించింది. వుడా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు కొన్ని నెలల క్రితం లేఖ కూడా రాసింది. కేంద్రం అనుమతి ఇస్తుందని తొలి విడతగా 1,105 ఎకారాల్లోని సీతకొండ( 893 ఎకరాలు), ఎర్రకొండ(212 ఎకరాలు) పర్యాటక ప్రాజెక్టుల కోసం టెండర్లు కూడా పిలిచింది. వీటి  పరిశీలనకు కన్సల్టెన్సీని కూడా నియమించేసింది.



కుదరదంటే కుదరదు

కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఐజీ నగ్వీ ఇటీవల జిల్లాలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించారు. రిజర్వు ఫారెస్టు పరిధిలోని కొండలను డీనోటిఫై చేయలేమని తేల్చిచెప్పారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పర్యాటక ప్రాజక్టులు, విల్లాల నిర్మాణం మొదైలవి ప్రైవేటు రంగంలో నెలకొల్పనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అవి ప్రజోపయోగ ప్రాజెక్టులు కాకుండా వ్యాపారాత్మక ప్రాజెక్టులు కిందకు వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో రెవెన్యూ పోరంబోకు కొండలపై  పీపీపీ ప్రాజెక్టులు నిర్మించుకోమని కూడా నగ్వీ సూచించారు. రిజర్వు ఫారెస్టు భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అనుమతించినా న్యాయపరమై ఇబ్బందులు వస్తాయని చెప్పడం గమనార్హం.



యాజమాన్య హక్కు ఇవ్వాల్సిందే

 అటవీ శాఖ అభ్యంతరంతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారు. లీజకు విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. చెట్లను ఇష్టానుశారం నరకడానికి వీల్లేదు. ఓ పరిమితికి మించి నిర్మాణాలు చేపట్టకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే లీజును రద్దు చేస్తారు కూడా. ప్రభుత్వం మాత్రం కొండలను తమ అస్మదీయులకు కట్టబెట్టి వాటిపై భారీ నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించింది. అందుకే ఆ కొండలను డీనోటిఫై చేస్తూ యాజమాన్య హక్కు బదలాయించేలా కేంద్ర ఉన్నతాధికారులను ఒప్పించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. తగిన ప్రతిపాదనలతో ఓ బృందం ఢిల్లీ వెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top