చర్లపల్లిలో ఆగని ట్రింగ్ ట్రింగ్


ఖైదీ వద్ద సెల్‌ఫోన్ లభ్యం   

జైలు సిబ్బంది ఉరుకులుపరుగులు


 

హైదరాబాద్: హైటెక్ జైలుగా పేరొందిన చర్లపల్లి కేంద్ర కారాగారంలో ‘బడా ఖైదీ’ల వద్ద సెల్‌ఫోన్లు లభ్యమైన సంఘటనలో ఉన్నతాధికారులకు స్థాన చలనం కలిగి నెల రోజులు గడవకముందే మరోసారి సెల్‌ఫోన్ మోగడంతో కలకలం రేగింది. పెరోల్ ఇప్పించాలంటూ ఓ న్యాయవాదితో మాట్లాడుతున్న జీవిత ఖైదీకి సంబంధించిన వివరాలు సోమవారం ఓ చానల్‌లో ప్రసారం కావడంతో జైలు సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం, తాడేపల్లి గూడెం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి ఓ హత్య కేసులో నిందితుడు. పెరోల్ కోసం దరఖాస్తు చేసుకునే విషయమై గోపాలకృష్ణ అనే న్యాయవాదితో ఆయన తరచుగా మాట్లాడుతున్నాడు.



దీనిపై విసుగు చెందిన లాయర్ ఓ టీవీ చానల్‌ను ఆశ్రయించడంతో విష యం వెలుగులోకి వచ్చింది. ఇదే కాదు... సెల్‌ఫోన్లు, నీలి చిత్రాలతో నింపివున్న పెన్‌డ్రైవ్‌లు కూడా ఖైదీల వద్ద లభ్యం కావడంతో సిబ్బంది కూడా విస్తుపోతున్నారు. గత నెల 16న రెండు, 19న మరో రెండు సెల్‌ఫోన్లు లభ్యమైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. జైలు ఆవరణలో సెల్‌ఫోన్ జామర్ల ఏర్పాటుకు మోకాలడ్డుతున్న అధికారులే ఈ ఖైదీలకు సాయపడున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



విచారణ చేపడతాం: ఎం.ఆర్.భాస్కర్



వీరాస్వామి వద్ద సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీనిపై విచారణ చేస్తామని సూపరింటెండెంట్ భాస్కర్ చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top