ఫిబ్రవరిలో రిమ్స్‌కు డీఎంఈ

ఫిబ్రవరిలో రిమ్స్‌కు డీఎంఈ - Sakshi


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని

ఒంగోలు సెంట్రల్: ‘రిమ్స్‌కే రోగమెచ్చింది’ అనే శీర్షికన బుధవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంట అల్పాహారం స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రిమ్స్ సమస్యలపై ఫిబ్రవరి మొదటి వారంలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్లు రిమ్స్‌ను సందర్శించి సమస్యలపై అధ్యయనం చేస్తారన్నారు.



ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వైన్‌ఫ్లూకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వైద్య బృందాన్ని రాష్ట్రానికి పంపించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు 24 నమోదు అయ్యాయని, 2 మరణాలు సంభవించాయన్నారు. దీని నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని వైద్యశాలల్లో ఐసొలేషన్ వార్డులు, మందులు, మాస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

 

‘సాక్షి’పై రిమ్స్ డెరైక్టర్ ఆక్రోశం

సాక్షి ప్రచురించిన కథనంపై రిమ్స్ డెరైక్టర్ ఆక్రోశం వెళ్లగక్కారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కలిసిన అనంతరం మాట్లాడుతూ ‘మంత్రి వచ్చినప్పుడే రాయాలా’ అని మండి పడ్డారు. ‘మంత్రికి రిమ్స్ సమస్యలు తెలిస్తేనే కదా పరిష్కరించేది’ అని సాక్షి విలేకరి అనడంతో తాను వెళ్లిపోయిన తర్వాత రిమ్స్‌కు వైద్య ప్రొఫెసర్లు ఎవరూ రారని తెలిపారు. రిమ్స్ అదనపు ఆర్‌ఎంఓ సుబ్బారావు కూడా అసహనం వ్యక్తం చేశారు.

 

స్వైన్‌ఫ్లూపై వైద్యశాఖ అవగాహన కార్యక్రమాలు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వైన్‌ఫ్లూపై నగరంలోని పలు కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, మురికి వాడలు, విద్యాసంస్థల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణపై బుధవారం అవగాహన కల్పించారు. సమస్యపై సాక్షి విలేకరి మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో ప్రశ్నించడంతో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె. యాస్మిన్ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో బి. శ్రీనివాసరావు, పద్మజ, హెల్త్ ఎడ్యుకేటర్లు సుమతి, శ్రీదేవి, కృష్ణారావు పాల్గొన్నారు.

 

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

కె.బిట్రగుంట(జరుగుమల్లి) : ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీరు, కరెంటు, తదితర సదుపాయాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కె.బిట్రగుంట గ్రామంలో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను మంత్రులు బుధవారం ప్రారంభించారు. మంత్రి గంటా మాట్లాడుతూ  కేజీబీవీ ఆహ్లాదకరంగా ఉందన్నారు. ప్రహరీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  బాలికలకు స్కూలు బ్యాగ్‌లు పంపిణీ చేశారు.  



మంత్రులు పి.మాణిక్యాలరావు, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, శిద్దా రాఘవరావు, పల్లె రఘనాథరెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ స్వామి, కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు, కరణం బలరామకృష్ణమూర్తి, కలెక్టర్ విజయకుమార్, సబ్‌కలెక్టర్ మల్లికార్జున, సినీ నటుడు అశోక్‌కుమార్, ఎంపీపీ పోటు పద్మావతి, జెడ్పీటీసీ గాలి పద్మావతి, సర్పంచి ఏలూరి రాంబాబు, కేజీబీవీ ఎస్‌వో ఎన్.స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top