బ్యాంకుల బాట..వేలం పాట!

బ్యాంకుల బాట..వేలం పాట! - Sakshi


ప్రొద్దుటూరు శివారు ప్రాంతానికి చెందిన సుబ్బరాయుడు రెండేళ్ల క్రితం 12 తులాల బంగారు నగలు తనఖా పెట్టి ఓ బ్యాంకులో రూ.2.20 లక్షలు రుణం తీసుకున్నాడు. వెంటనే డబ్బు చెల్లించి బంగారం విడిపించు కోవాలని, లేదంటే వేలం వేస్తామని మూడు రోజుల క్రితం బ్యాంకు వారు నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం ఇతను అసలు, వడ్డీ కట్టి నగలు విడిపించుకుపోయే స్థితిలో లేడు.

 

- బంగారం రుణాలు చెల్లించాలంటూ ప్రజలు, రైతులకు నోటీసులు

- స్పందించకపోతే వేలం పాటకు ప్రకటన

- రుణ మాఫీ అమలు కాక బంగారం విడిపించుకోలేక పోయిన రైతులు

- ధర తగ్గుదలతో నష్టాల నుంచి బయట పడటానికి బ్యాంకర్ల ఎత్తులు

- లబోదిబోమంటున్న పేదలు, రైతులు

ప్రొద్దుటూరు :
బంగారం ధర రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో జిల్లాలోని బ్యాంకులన్నీ వరుస పెట్టి వేలం పాటలకు తెరలేపాయి. తమ వద్ద బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ధర మరింత తగ్గితే వసూళ్లు తగ్గిపోతాయని భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 32 బ్యాంక్‌ల పరిధిలో 340 బ్రాంచిలు నడుస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంక్‌లు ఉన్నాయి. అధిక వడ్డీలు చెల్లించలేక రైతులు, ప్రజలు తమ అవసరాల కోసం బంగారాన్ని బ్యాంక్‌ల్లో పెట్టి రుణం పొందడం పరిపాటి. ఇలా రుణాలు పొందే వారిలో అత్యధిక శాతం రైతులే ఉన్నారు.



సాధారణంగా రుణం తీసుకుంటే 90 పైసలు ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉండగా రైతులు 7 శాతం వడ్డీ ప్రకార ం రుణం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ అవసరాలకు రైతులు బంగారు నగలను తాకట్టు పెట్టి బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందుతున్నారు. ఈ ప్రకారం అన్ని బ్యాంకుల్లో రైతులు పెద్ద మొత్తాల్లో రుణాలు పొందారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికార పీఠం అధిష్టించాక  మాట మార్చిన చంద్రబాబు చివరికి అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తానని ప్రకటించారు. అది కూడా ఐదు విడతలుగా ఐదేళ్లు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక విడత రుణమాఫీ డబ్బు మాత్రమే అరకొరగా ఇవ్వడంతో ఆభరణాలు చాలా వరకు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. పరిస్థితిని బట్టి విడిపించుకోవచ్చనే యోచనలో చాలా మంది రైతులు ఉన్నారు.

 

బంగారం ధర తగ్గుదలతో వేలం ప్రకటనలు

సాధారణంగా బ్యాంకుల్లో గ్రాముల ప్రకారం బంగారు నగలకు రుణం ఇస్తారు. బ్యాంకర్ల నిబంధనల ప్రకారం ఆభరణాలను బట్టి 75 శాతం వరకు రుణం ఇచ్చే పరిస్థితి ఉంది. బంగారం 22 క్యారెట్లా, 24 క్యారెట్లా అనే విషయాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. గతంలో 10 గ్రాముల బంగారం రూ.31వేలు ఉండగా క్రమేణ తగ్గుతూ వస్తోంది. సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.23,380, 24 క్యారెట్ల ధర రూ.25,250గా నమోదైంది. పక్షం రోజులుగా రోజు రోజుకు ధరలు తగ్గుతున్నాయి. మరికొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటంతో బ్యాంకర్లల్లో కూడా ఆందోళన మొదలైంది.



గతంలో గ్రాము బంగారుకు రూ.2,100 వరకు రుణం ఇచ్చిన వారు ఇపుడు రూ.1600-1700 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఈ కారణంగా గతంలో బంగారు అభరణాలు ఉంచి రుణం తీసుకున్న వారి బంగారం-రుణం ఇంచుమించు సరిపోయే పరిస్థితుల కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు నష్టాలు వస్తాయని భావించిన బ్యాంకర్లు వరుసగా వేలం పాటలు నిర్వహించేందుకు ప్రకటనలు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏడాది వరకు బ్యాంక్‌లు కాలపరిమితి విధించి బంగారంపై రుణాలు ఇస్తాయి. మూడేళ్లకు తప్పనిసరిగా వీటిని విడిపించుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతుండటంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేసి వేలం పాటలకే మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top