విద్యుత్ శాఖలో అడ్డగోలు బదిలీలు


ఒంగోలు క్రైం: జిల్లాలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు అడ్డగోలుగా సాగుతున్నాయి. ఒకపక్క బదిలీలపై నిషేధ ఉత్తర్వులున్నా..వాటిని బేఖాతరు చేస్తూ తిరుపతిలోని ఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలో యథేచ్ఛగా బదిలీలు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకుల అనుయాయులు, పార్టీ సానుభూతిపరులు అడిగిన చోట అడిగినట్లుగా బదిలీలు చేయించేందుకు పూనుకున్నారు.



తిరుపతి ఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలోని ఉన్నతాధికారి సైతం అధికార పార్టీకి దాసోహమంటూ ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని సిబ్బంది అభ్యర్థనలు, పరస్పర ఆమోద బదిలీలకు తొలుత అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియ రెండు నెలల క్రితం మొదలైంది. ఈ విభాగంలో సబ్‌స్టేషన్లలో పనిచేసే సిబ్బంది మొదలుకొని విద్యుత్ సంస్థలో ఫీల్డ్ స్టాఫ్ అందరికీ బదిలీల అవకాశం కల్పించారు. మొదట్లో ఇంజినీర్లకు బదిలీలు లేవని ప్రకటించారు.



  ప్రొవెన్షియల్ సిబ్బందిలో కేవలం అకౌంట్స్ విభాగంలో ఉన్న కొంతమందికి అవకాశం ఉందంటూ కూడా మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ ప్రొవెన్షియల్ సిబ్బందిలోనే ఇంజినీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, యూడీసీలు, ఎల్‌డీసీలు, కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి బదిలీల అవకాశం కల్పించలేదు. అయితే ఆ తరువాత ప్రొవెన్షియల్ విభాగంలో కూడా రిక్వెస్ట్‌లు, మ్యూచ్‌వల్స్ అవకాశం ఇస్తున్నట్లు తిరుపతి కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి సందేశం వచ్చింది. దానికి కొంత గడువు మాత్రమే విధించారు.



 గత నెలలోనే ఈ గడువు ముగిసింది. అయితే  తిరుపతి కార్యాలయంలో మాత్రం ఈనెల 4 లోపు వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేస్తున్నామని చెప్పుకుంటూ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఇష్టానుసారం బదిలీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని డీఈల బదిలీలు రెండుసార్లు, ఏఈల బదిలీలు రెండుసార్లు చేసుకుంటూ వచ్చారు.



 ఉన్నట్లుండి గత సోమవారం జిల్లాలోని ఆరుగురు ఏఈలకు స్థాన చలనం కల్పిస్తూ డిస్కం సీఎండీ హెచ్‌వై దొర జిల్లా కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. వాస్తవానికి 4వ తేదీతోనే ఈ బదిలీల ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అయినా వారం రోజులకు కూడా బదిలీలను చేసుకుంటూ పోవడం పట్ల  కిందిస్థాయి ఉద్యోగి మొదలుకుని జిల్లా ఉన్నతాధికారుల వరకు కొంత అసంతృప్తితో ఉన్నారు. అధికార పార్టీ నాయకులు ఉన్నతాధికారులపై పట్టుబట్టి బదిలీలు చేయిస్తుండడంతో నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది.

 

 ప్రాధాన్యత గల స్థానాలపై దృష్టి: అధికార పార్టీ నాయకుల అండదండలు మెండుగా ఉన్న ఈ శాఖలోని కొందరు ఏఈలు ప్రాధాన్యత గల స్థానాలపై దృష్టి సారించారు. అవసరమైతే అధికార పార్టీ నేతలకు రూ.లక్షల కొద్దీ ముట్టజెప్పడానికి కూడా వెనుకాడలేదని సమాచారం. ప్రాధాన్యత గల స్థానాలతోపాటు ఆదాయ వనరులు మెండుగా సమకూరే స్థానాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇప్పటికే పలు దఫాలుగా బదిలీ అయిన వారు విధుల్లో చేరిపోయారు.



 మొదటి విడత డీఈల బదిలీల నేపథ్యంలో అధికారుల మధ్య కొంత దుమారం కూడా చెలరేగింది. అప్పట్లో కనిగిరి డీఈని ఒంగోలు డీఈటీగా బదిలీ చేస్తే ఆయన విధుల్లో చేరకుండానే సెలవుపై వెళ్లిపోయారు. అప్పట్లో ఇద్దరు ముగ్గురు డీఈలు విధుల్లో చేరనేలేదు. ఆ తరువాత రెండో దఫా కూడా డీఈలను బదిలీ చేశారు. ఆ తరువాత మొదటి విడత ఏఈలు కొంతమందికి బదిలీ అవకాశం కల్పించారు. ఆ బదిలీల్లోనూ అధికార పార్టీ మార్కు కొట్టొచ్చినట్లు కనపడింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top