మాపటేళ తవ్వి..మూటలకు ఎత్తి..

మాపటేళ తవ్వి..మూటలకు ఎత్తి..


సాక్షి, రాజమండ్రి :గోదావరి ఒడ్డున నివపించే ఓ బడుగు మనిషికి ఏ పెరటి గోడ కట్టుకోవడానికో నాలుగు బస్తాల ఇసుక అవసరమైందనుకోండి.. అయినా దాని కోసం నది వంక చూడడానికి సాహసించడు. కారణం.. ఇసుక తవ్వి, బస్తాలకు ఎత్తితే ఎలాంటి చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందోనన్న భయమే. అయితే ఇలాంటి జంకుగొంకులు బడాబాబులకు, ఇసుక అక్రమార్కులకు అణుమాత్రం లేవు. నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా వారికి లంకల్లో రెల్లుగడ్డి పాటి అడ్డంకి కాదు. తీరానికి చేరువ లోనూ, గోదావరి లంకల్లోనూ నివాసం ఉండే మత్స్యకారులతో నదిలో ఇసుకను రాత్రిళ్లు తవ్విస్తున్నారు. రాజమండ్రి నుంచి ఎగువన సీతానగరం మండలం వరకూ రోజూ తెల్లారేసరికి గట్టుపై లాట్లు పడుతున్న వేలాది బస్తాల ఇసుకే అందుకు సాక్ష్యం. ఈ రకంగా బస్తాల రూపంలో నెలకు రూ.కోటికి పైగా విలువైన ఇసుక తరలిపోతోంది. రాజమండ్రి కోటిలింగాలరేవులో ఏ రోజు చూసినా పది లారీలలో లోడు చేయగలన్ని ఇసుకబ స్తాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా ఈ నదీ సంపద దోపిడి బాగోతం నిరాటంకంగా నడిచిపోతూనే ఉంది. ఈ అక్రమ దందాకు ఎవరైనా అధికారులు అడ్డం వస్తే.. రాజకీయ పలుకుబడిని చూపి బెదిరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు రంగ ప్రవేశం చేసి ‘అక్రమార్కులకు’ అండగా నిలుస్తున్నారు. అధికారులు చేతలుడిగి, చేతులు కట్టుకునేలా చేస్తున్నారు.

 

 బస్తాలకెక్కించి, లారీల్లో దిగబోయించి..

 అక్రమార్కులు మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే మామూలు నావలనే నది నడుమ నుంచి ఇసుకను ఒడ్డుకు చేర్చడానికి వాడుతున్నారు. ఇలాంటి నావలకు ఇంజన్‌లు బిగించేందుకు అనుమతి ఉండదు. అయితే అక్రమార్కులు యథేచ్ఛగా వాటికి ఇంజన్లు అమర్చి మత్స్యకారులకు అందజేస్తున్నారు. మత్స్యకారులు తవ్వి ఒడ్డుకు చేర్చిన ఇసుకను తెల్లారేసరికల్లా ఖాళీ సిమెంట్ సంచుల్లో నింపుతారు. అక్కడి నుంచి ఆ బస్తాలను వ్యాన్లలో నగర శివార్లకు చేరుస్తారు. అక్కడ సంచుల నుంచి లారీల్లో దిగబోయించి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించి, అమ్ముతుంటారు. ఇలా ఒక లారీ ఇసుకను అవసరమైన వారికి చేర్చేందుకు రూ.4000 వసూలు చే స్తున్నట్టు సమాచారం. నగరానికి చెందిన ఒక బడా కాంట్రాక్టర్ కూడా తాను నిర్మించే అపార్టుమెంట్లకు, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న పనులకు అవసరమైన ఇసుకను ఇదే తరహాలో తరలిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 ఆ రేవులు అక్ర మాలకు కేంద్రబిందువులు..

 రాజమండ్రిలోని పుష్కరాల రేవు నుంచి ఎగువన సీతానగరం వరకూ గోదావరి తీరంలోని 15కు పైగా స్నానఘట్టాలు ఇసుక అక్రమ తరలింపునకు వేదికలుగా మారాయి. రాజమండ్రి కోటి లింగాలరేవు, వంగలపూడి, ముగ్గళ్ల, మునికూడలి రేవుల సమీపంలో గత వారం రోజులుగా ఇసుక తవ్వకాలు భారీగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వెంకట నగరం, కాతేరు ప్రాంతాల నుంచి కూడా అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీపావళి కారణంగా అధికారులు సెలవుల్లో ఉంటారు. ప్రజల దృష్టి పండుగపై ఉంటుందనే భావనతో రెండురోజులుగా ఇసుక తవ్వకం, తరలింపులను రెండింతలు చేశారని సమాచారం. రాజమండ్రి-సీతానగరం నడుమ రేవుల నుంచి ఈ రకంగా బస్తాల రూపంలో నెలకు దాదాపు 2500 లారీల ఇసుకను తరలించుకుపోతున్నట్టు అంచనా. ఈ వివరాలు తమ వద్ద ఉన్నాయని, అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మౌనంగా ఉంటున్నామని ఓ అధికారి ‘సాక్షి’ వద్ద నిట్టూర్చారు. పండ్లున్న పాపానికి రాళ్ల దెబ్బలు తప్పని చెట్టులా.. కడుపులో బంగరు వన్నె ఇసుకను కలిగిన నేరానికి గోదారమ్మ ఎన్ని రకాల కుళ్లగింపులను అనుభవించాలో, అక్రమార్కుల బొక్కసాలను ఇంకెన్నాళ్లు నింపాలో కదా!

 

 సరుకు మాదే వదిలేయ్...

 రాజమండ్రి కోటిలింగాల రేవులో అర్బన్ తహశీల్దారు పి.వి.వి.గోపాల కృష్ణ, గనుల శా ఏడీ కె.సుబ్బారావు, మత్స్యశాఖ ఏడీ పి.జయరావు శుక్రవారం అక్రమంగా ఇసుక తవ్వుతున్న ఆరు మత్స్యకార నావలను, వాటికి బిగించిన ఇంజన్లను, 2 వేల బస్తాల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో చేరువలోనే ఉన్న మరిన్ని వేల ఇసుక బస్తాల గురించి అధికారులు ఆరా తీయకపోవడం గమనార్హం. కాగా నావలను స్వాదీనం చేసుకుంటున్న సమయంలో అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్ అక్కడి వచ్చి ఆ ఇసుక తమదేనని చెప్పి, విడిచి పెట్టాలని హుకుం జారీ చేశారు. అంతటితో ఆగక తహశీల్దారు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చే శారు. ఏదేమైనా కాంట్రాక్టర్ ధాష్టీకం.. అధికార పార్టీ అండ చూసుకుని ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top