నిబంధన..లే అవుట్

నిబంధన..లే అవుట్ - Sakshi


కుమ్మక్కయ్యారు. నిబంధనల్ని  విస్మరించి, సర్కారు ఖజానాకు రూ.కోట్లలో ఎగనామం పెట్టారు. రాష్ట్ర విభజన తో పాటు తుని మీదుగా కోస్తా కారిడార్ వెళ్లనున్న నేపథ్యంలో ఆ పట్టణ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్టర్లతో పాటు ఆ అవతారమెత్తిన కొందరు నేతలు అక్రమ లే అవుట్లు వేసి సొమ్ము చేసుకున్నారు. ఆ ప్లాట్లను

 కొన్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

 

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :తుని పట్టణ పరిధిలో, పరిసరాల్లో భూముల ధరలు చకచకా పెరుగుతున్న క్రమంలో సమీపంలోని ఎస్.అన్నవరంపై రియల్టర్‌ల కన్ను పడింది. ఎస్.అన్నవరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అధికారపార్టీ పెద్దల కనుసన్నల్లో వారి అనుచరులు, ఆ పార్టీ తరఫున పట్టణంలో పగ్గాలు చేపట్టిన ఇద్దరు ముఖ్య నేతలు, కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొందరు నాయకులు రియల్టర్‌ల అవతారమెత్తారు. అనుమతులు లేకుం డానే లే అవుట్‌లు వేసి ప్లాట్లను అమ్మేశారు.  ఎస్.అన్నవరం, తుని పరిసర ప్రాంతాల్లో సుమారు 300 ఎకరాల్లో 112 లే అవుట్లుగా వేశారు. వాస్తవానికి ఆ భూములను లే అవుట్ చేయడానికి పాటించాల్సిన నియమనిబంధనలను ఖాతరు చేయకుండా ‘తాండవ’లో కలిపేసి, ప్లాట్లుగా విడగొట్టి అమ్ముకున్నారు. అంతటితో ఆగకుండా సామాజిక అవసరాల కోసం కేటాయించాల్సిన 10 శాతం భూమిని కూడా దర్జాగా విక్రయించేశారు. ఈ తతంగమంతా బహిరంగంగా జరుగుతున్నా అధికారుల కళ్లకు కనిపించ లేదు. అధికారపార్టీకి చెందిన బడా నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వెనకున్నందునే ఈ అక్రమ భూదందాను తొంగి చూడలేదంటున్నారు. తుని, ఎస్.అన్నవరం తదితర ప్రాంతాలలో నిబంధనలు తుంగలో తొక్కి రియల్టర్లు సాగించిన భూ అమ్మకాలతో రూ.25 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు అంచనా. ఈ విషయాలు ఇటీవల విజిలెన్స్ తనీఖీల్లో వెలుగు చూసినా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

 

 అన్ని రుసుములకూ ఎగనామమే..

 వ్యవసాయ భూమిని లే అవుట్‌గా వేయాలంటే ల్యాండ్ కన్వర్షన్ (భూమి మార్పిడి) ఫీజుగా భూమి మార్కెట్ విలువలో 10 శాతం రెవెన్యూ శాఖకు చెల్లించాలి. ఆర్డీఓ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత లే అవుట్ ఉన్న పంచాయతీ లేదా మున్సిపాలిటీకి సామాజిక అవసరాల కోసం పది శాతం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించాలి. రోడ్లు , కాలువలు, తాగునీరు తదితర అవసరాలకు డెవలప్‌మెంట్ ఫీజులు చెల్లించాలి. ఇవన్నీ పూర్తి చేశాక డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) లేదా వుడా (తుని వుడా పరిధిలో ఉంది) నుంచి అనుమతి పొందాలి. ఈ అనుమతులన్నీ వచ్చాకే ప్లాట్లను విక్రయించాలి. ఇవేమీ లేకుండానే తుని పరిసర ప్రాంతాల్లో రియల్టర్లు సుమారు 300 ఎకరాల్లో లే అవుట్లు వేశారు. 10 శాతం చొప్పున సామాజిక అవసరాలకు కేటాయించాల్సిన 30 ఎకరాల భూమిని కూడా అమ్మేశారు. తుని పరిసర ప్రాంతాల్లో ఎకరం రూ.80 లక్షలు పలుకుతోంది. అంటే వ్యవసాయ భూమిని నివాసావసరాలకు మార్పిడి చేయడానికి రూ.24 కోట్లు చెల్లించాలి. రియల్టర్ల బేఖాతరుతో ఆ మేరకు స్థానిక సంస్థల రాబడికి గండి పడింది. మార్కెట్ విలువ అటుంచి ప్రభుత్వం నిర్దేశించిన భూమి విలువ(ఎకరం రూ.10 లక్షలు) ప్రకారం చూసుకున్నా సామాజిక స్థలం, భూ మార్పిడుల కింద కనీసం రూ.3.50 కోట్లు కోల్పోయినట్టు అంచనా. ఈ లే అవుట్లపై రెండు నెలల క్రితం జిల్లా పంచాయితీ అధికారి అదేశాల మేరకు పది బృందాలతో పరిశీలన చేసి నివేదిక పంపారు. అయితే పెద్దల హస్తం ఉండటంతో ఇంత వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోయారు.

 

 ఇల్లు కట్టబోతే ఇక్కట్లే..

 కాగా ఈ లే అవుట్లలో తుని పట్టణం, రూరల్ మండల పరిధిలోని ఉద్యోగులు, మధ్య తరగతి వారు పెద్ద ఎత్తున ప్లాట్లు కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇప్పుడు వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుక్కున్న ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవాలనుకుంటే అటు మున్సిపాలిటీ, ఇటు పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అనధికార లే అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి తమను నిలువునా ముంచేశాయని ఆవేదన చెందుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top