అక్రమ కేసులపై ప్రజా ఉద్యమం


సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మా సహనాన్ని, మంచితనాన్ని చేతగానితంగా భావించొద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసుల బనాయిస్తున్నారు. వీటికి ఎంతమాత్రం భయపడేది లేదు. అక్రమ కేసులపై ప్రజా ఉద్యమం చేపడతాం.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రకటించారు. కర్నూలులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత, మణిగాంధీ, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి తదితరులు మాట్లాడారు.

 

 భూమా నాగిరెడ్డి ఆరోగ్యంపై వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ను ఈ సందర్భంగా నేతలు మీడియాకు చూపించారు. ఇప్పటికే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగిందని.. బీపీ, షుగర్ వ్యాధులతో బాధ పడుతున్నారన్నారు. అయినప్పటికీ నిమ్స్‌కు తరలించేందుకు ఎస్కార్ట్‌ను ఇవ్వలేమని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విచారణ పేరుతో పోలీసు స్టేషన్‌లో కేబినెట్ ర్యాంకు కలిగిన పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే కూడా అయిన భూమా నాగిరెడ్డిని ఆరు గంటల పాటు ఉంచుకోవడం పోలీసుల వైఖరికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా సరైన సర్టిఫికెట్లు కూడా చూపకుండా జడ్జి ఎదుట తెల్లవారుజామున ప్రవేశపెట్టడాన్ని వారు తప్పుబట్టారు.

 

 టీడీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారు

 కొద్దిరోజుల క్రితం టీడీపీ సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పోలీసులతో అణచివేయిస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వీరు గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలీసులతో అక్రమ కేసులను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే భూమా నాగిరెడ్డిపై అనేక కేసులు పెట్టారని, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డిపైనా కేసులను నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. భయపడేవాళ్లు కర్నూలు జిల్లాలో రాజకీయాలు చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. అక్రమ కేసులపై ప్రజా ఉద్యమం చేపడతామని.. జాతీయ రహదారులను సైతం దిగ్బంధిస్తామని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వేధింపులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. భూమా నాగిరెడ్డికి ఏదైనా జరిగి... రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అందుకు కర్నూలు జిల్లా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా కులం పేరుతో దూషించినట్టు లేదన్నారు.

 

 ఒక ఎమ్మెల్యేను పోలీసులు చేయి పట్టుకు నెడితే.. డోంట్ టచ్ మీ అనడం సహజమని, ఎమ్మెల్యేతో ప్రవర్తించే ప్రొటోకాల్ ఇదేనా అని నిలదీశారు. నిజంగా కులం పేరుతో దూషిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంలో తప్పులేదని.. కేవలం వేధించేందుకు ఈ చట్టాన్ని ప్రయోగించడం మంచి పద్ధతి కాదన్నారు. ఉన్నతస్థాయిలోని అధికారులు ఈ విధంగా చేస్తే.. ఇక కిందనున్న పోలీసులు దొంగ కేసులను నమోదు చేయడం అలవాటుగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీతో ఉండకపోతే ఖబడ్డార్ అని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top