భూ గ్రహణం


ప్రారంభమవని ట్రిపుల్‌ఐటీ భూసేకరణ

రెవెన్యూను రూ.47 కోట్లు ఇచ్చిన  ట్రిపుల్‌ఐటీ

నోటిఫై చేసిన భూమిని విక్రయించే ప్రయత్నాలు

పట్టించుకోని ప్రస్తుత పాలకులు, అధికారులు

ఉన్నత విద్య సెక్రటరీ వద్ద నిలిచిపోయిన ఫైల్


 

నూజివీడు ట్రిపుల్‌ఐటీకి అవసరమైన భూముల సేకరణపై రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఆర్జీయూకేటీ నిధులు మంజూరుచేసి రెవెన్యూ శాఖకు అప్పగించినా భూ సేకరణలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. ఏడాది కాలంలో నెలకొన్న జాప్యం కారణంగా వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అరకొర వసతులతో సతమతమవుతున్నారు.

 

నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఏడు వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నారు. ప్రారంభంలో ఈ కళాశాలను కేవలం వంద ఎకరాల విస్తీర్ణంలోనే ఏర్పాటు చేశారు. ఇది సరిపోని నేపథ్యంలో మరో వంద ఎకరాలు కావాలంటూ ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ఆరేళ్లుగా అనేక సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అవసరాన్ని గమనించిన ప్రభుత్వం గత ఏడాది జనవరిలో కళాశాలను ఆనుకుని ఉన్న 113.60 ఎకరాల భూమిని గుర్తించి, దానిని సేకరించేందుకు జీవో జారీచేసింది. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆర్జీయూకేటీ రూ.47 కోట్లు అప్పగించినా భూమిని సేకరించడంలో మాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.



కలెక్టర్ నుంచి ప్రతిపాదన వెళ్లినా..



ట్రిపుల్ ఐటీకి అవసరమైన 113.60 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ ఈ ఏడాది జనవరి వరకు ఉన్న కలెక్టర్ రఘునందనరావు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణకు ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ఉన్నతవిద్య సెక్రటరీ టేబుల్ పైకి ఫైల్ పంపించారు. అయితే అక్కడకు వెళ్లిన ఫైల్‌ను ఎవరూ పట్టించుకోకపోవడంతో భూసేకరణకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. భూసేకరణను త్వరితగతిన జరుపుతారనే ఆశతో ఆర్జీయూకేటీ జీవో విడుదలైన వెంటనే రూ.47 కోట్లను రెవెన్యూ ఉన్నతాధికారులకు జమచేసింది. అయినప్పటికీ భూసేకరణ ప్రక్రియ అంగుళం కూడా ముందుకు కదలడం లేదు.



ప్లాట్లు వేసే ప్రయత్నాలు



ట్రిపుల్ ఐటీకి అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి కొంతమంది తమ భూములను ప్లాట్లు వేసి విక్రయించేపనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. నూజివీడు పరిధిలోని సర్వే నంబరు 1061/4 నుంచి 1061/17వరకు ఉన్న 113.60 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే రాష్ట్ర విభజన తరువాత నూజివీడు రాజధాని అవుతుందేమోనని ఎంతో ఆశపడినా అలాంటిదేమీ జరగలేదు.



అయినప్పటికీ గతంలో కంటే కొద్దిగా భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీని ఆనుకుని ఉన్న భూమిని ట్రిపుల్‌ఐటీకి ఇచ్చే కంటే గుట్టుచప్పుడు కాకుండా అనధికారికంగా ప్లాట్లు వేసి విక్రయించడానికి ఆ భూముల యజమనాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం నోటిఫై చేసిన తరువాత ఆ భూమిని విక్రయించడానికి, కొనడానికి కుదరదు. కొన్నట్లయితే కొనుక్కున్నవారు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు మొద్దునిద్ర నటిస్తున్నారు.



విద్యార్థులకు అందుబాటులో లేని సదుపాయాలు



ట్రిపుల్ ఐటీకి చాలినంత భూమి లేకపోవడంతో స్థాపించి ఆరేళ్లు గడిచినా నేటికి ఇంకా పలు సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. ఇంజినీరింగు విద్యార్థులకు ముఖ్యంగా సెంట్రల్ లైబ్రరి అవసరం. ఇంజినీరింగులో ప్రతి బ్రాంచికి డిపార్ట్‌మెంటల్ భవనాలు, పరిపాలన భవనం, కాన్ఫరెన్స్‌హాల్, ఆడిటోరియం, పరిశోధనలకు ప్రత్యేకమైన వింగ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్‌పూల్, వ్యాయామశాలలతో పాటు ఆటస్థలం అందుబాటులో ఉండాలి. ఇవేమీ లేనప్పటికీ విద్యార్థులు చదువులను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి భూసేకరణ జరపాలని విద్యార్థులు, ట్రిపుల్‌ఐటీ వర్గాలు కోరుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top