ఇఫ్తార్ వేళ.. గంజి పసందు

ఇఫ్తార్ వేళ.. గంజి పసందు


ఉపవాస దీక్షాధారులకు చల్లదనం

వేలమంది ముస్లింలకు పంపిణీ


 

వన్‌టౌన్ : సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ అన్న పానీయాలను పూర్తిగా పక్కన పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలను కొనసాగిస్తున్న ముస్లింలకు ‘గంజి’ పసందునిస్తుంది. దీక్ష చేస్తున్న వారు గంజి తీసుకోవడం ద్వారా వారి కడుపును చల్లబరచడమే కాకుండా బలవర్ధకంగా వారిని తీర్చిదిద్దుతుంది. వన్‌టౌన్‌లోని వివిధ మసీదుల నిర్వాహకులు ప్రతి రోజూ గంజిని పంపిణీ చేస్తున్నారు. మసీదుల ద్వారా వివిధ ప్రాంతాల్లోని సేవాతత్పరులు సైతం నగర వ్యాప్తంగా ఇళ్లలో ఇఫ్తార్‌లు నిర్వహించే వారికి ఈ గంజి వంటకాన్ని పంపిణీ చే స్తున్నారు. దీక్షల విరమణ సమయంలో గ్లాసు గంజినైనా తాగేందుకు పోటీపడతారు.

 

దశాబ్దాలుగా పంపిణీ


 నగరంలోని వించిపేట, తారాపేట, భవానీపురం తదితర ప్రాంతాల్లోని మసీదులు నిర్వాహకులు గంజిని ప్రత్యేకంగా తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పశ్చి మ నియోజకవర్గంలో గంజి పంపిణీని నిర్వహిస్తున్నారు. వించిపేట షాహీ మసీదు వద్ద  వందలాది మందికి గంజి పంపిణీ జరుగుతుంది. ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు వ ందలాదిగా ముస్లింలు బారులు తీరి కనిపిస్తారు.

 

పేదల కోసమే..

 పూర్వం నిరుపేదలైన ముస్లింలు అనేక మంది రంజాన్ ఉపవాస దీక్షలుండేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలున్నాక సాయంత్రానికి సరైన ఆహారాన్ని తీసుకోవడానికి కూడా వారికి ఆర్థిక పరిస్థితి సహకరించేదికాదు. ఉపవాసాలున్నవారు ఇఫ్తార్ వేళకు అన్నం లేకున్నా కనీసం గంజి నీళ్లైనా తీసుకోవాలనే భావనతో దీని పంపిణీని ప్రారంభించారని ముస్లిం పెద్దలు వివరిస్తున్నారు. మొత్తం మీద చాలా కుటుంబాలు ఇఫ్తార్ సమయంలో గంజి తీసుకోవడం ఆనవాయితీగా మారింది.

 

 గంజిని ఇలా తయారు చేస్తారు..

 గంజి తయారీలో ఉప్మా రవ్వ, లవంగ, యాలుక్కాయలు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమాటా, వెల్లులిపాయలను నూనెతో కలిపి గంజిని తయారు చేస్తారు. ముందుగా మసాలా దినుసులను వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటాలను నూనెలో వేయిస్తారు. వేయించడం పూర్తయ్యాక పెద్ద వంట పాత్రల్లో నిండా నీళ్లు పోస్తారు. నీళ్లు బాగా మరిగాక అందులో రవ్వను గడ్డకట్టకుం డా వేస్తూ కలియ తిప్పుతారు. కొద్దిసేపు వంట పాత్రలోనే ఉంచి పంపిణీ చేస్తారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top