చెన్నైకి నీటిని విడుదల చేస్తే ఒప్పుకోం


  • కాలువ రిపేర్లకు నిధులు విడుదల చేయకపోవడం దారుణం

  • సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి

  • నెల్లూరు (రవాణా): జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చకుండా కండలేరు నుంచి తమిళనాడుకు నీరు తరలిస్తే ఒప్పుకునేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన  వెంకటాచలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కనుపూరు కాలువ డీఈ, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.



    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కండలేరు నుంచి చెన్నైకి తాగునీటి అవసరాలకు మూడు టీఎం సీల నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే కృష్ణానది నుంచి 15 టీఎంసీల నీటిని విడుదల చేసిన తరువాతే తమిళనాడుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడుకు నీటి విడుదలపై ఎలాంటి దురుద్దేశం లేద ని, జల్లా రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు.



    రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నీటిని విడుదల చేసేం దుకు సైన్యాన్ని రంగంలోకి దింపినా ఎదురొడ్డి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వెంకన్నపాళెం, బద్దెవోలు, కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కండలేరు నీటి విడుదలపై జిల్లా మంత్రి పునఃసమీక్షించాలని కోరారు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఆ గ్రామాలకు నీరు విడుదల చేస్తామని హమీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.



    కండలేరు నీటిని ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్నారు. కనుపూరు కాలువ ఆయకట్టు భూములకు నీరు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్, జేసీకి విజ్ఞప్తి చేశారు. మనుబోలు మండలంలో మూడు గ్రామాలు నీటికి ఇబ్బందులు పడుతున్నాయని, నీటిమట్టాన్ని పెంచి వాటికి కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రైతులు శిస్తు కట్టని కారణంగానే నీరు విడుదల చేయలేకపోతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు.



    రైతులు కట్టిన పన్నుల మేరకు పనులు చేయకుండా అధికారులు అనాలోచిత నిర్ణయం తీసుకోవ డం పంటలకు శరాఘాతంగా మారిందన్నారు. సంగం ఆనకట్ట మీద ఇసుక బస్తాలు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధికారులు సమన్వయంతో ప్రణాళికబద్ధంగా నీరు విడుదల చేయాలని కోరారు. నీటి విడుదలపై ప్రతిరోజూ పర్యవేక్షణ ఉంటుం దన్నారు.



    రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నీరు వృథాకాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కనుపూరు కాలువ డీఈ సమీవుల్లా, ఏఈలు, జడ్‌పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కె.చెంచుకృష్ణయ్యనాయుడు, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడపాల ఏడుకొండలు, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు అక్బర్, వైఎస్సార్‌సీపీ నాయకులు వల్లూరు శ్రీధరనాయుడు, నోశిన వెంకటేశ్వర్లు, వెలిబోయిన వెంకటేశ్వర్లు, మందా కృష్ణ, కనుపూరు కోదండరామిరెడ్డి పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top