వెలుగుల సాకుతో చీకటి కాసులు


సాక్షి, రాజమండ్రి :విద్యుత్తు ఆదాలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేందుకు నగరంలోని 11 వేల వీధిలైట్లను ఎల్‌ఈడీ టెక్నాలజీ లైట్లతో మార్పు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘హైపీరియన్ గ్రీన్ ఎనర్జీ’ అనే సంస్థతో 2009 నవంబరులో నగరపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మే 2013 నాటికి 90 శాతం లైట్లను ఎల్‌ఈడీలుగా మార్చేశారు. కానీ తర్వాత నగరపాలక సంస్థకు, కాంట్రాక్టు కంపెనీకి మధ్య తలెత్తిన విభేదాలతో లైట్ల నిర్వహణ మూలన పడింది. వీధుల్లో 75 శాతం లైట్లు వెలగడం మానేశాయి. దీంతో ఎల్‌ఈడీ లైట్ల అవకతవకలపై జూలై 24న కౌన్సిల్ తన తొలి సమావేశంలో చర్చించింది. నగరంలో వెలగని లైట్ల స్థానంలో ట్యూబ్‌లైట్లు, ఫ్లోరోసెంట్ లైట్లు కొని అమర్చడానికి రూ.37.40 లక్షలు, గతంలో తొలగించిన లైట్లనే మరమ్మతులు చేసి బిగించేందుకు రూ.18.50 లక్షలు మొత్తం రూ.55.9 లక్షల ఖర్చు చేసేందుకు అనుమతించారు.

 

 కొత్త అక్రమాలకు నాంది..

 ఇందులో భాగంగా తక్షణం అధికారులు రూ.29.45 లక్షలతో 36, 150 వాట్ల ఫ్లోరోసెంట్ లైట్లు, పైపులు, వైర్లు ఇతర బిగింపు సామగ్రి కొనుగోలుకు టెండర్లు పిలిచారు. ఒక కాంట్రాక్టరు ఏకంగా 23 శాతం తక్కువ కోట్ చేశారంటూ టెండర్లు అప్పగించారు. ఈ టెండర్ ధరల్లో క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీకి చెందిన 36 వాట్ల ఫ్లోరో సెంట్ లైట్ పోల్‌పై బిగించేందుకు సిద్ధంగా ఉండే విధంగారూ.1445 నిర్ణయించారు. మొత్తం 1000 లైట్లకోసం రూ.14.45 లక్షలు అంచనా వేశారు.  మరొక మోడల్ 150 వాట్ ఎస్‌వీ ల్యూమినైర్ ఇంటిగ్రల్ మోడల్ లైట్లు ఒక్కొక్కటి పోల్‌పై బిగించేందుకు వీలుగా పంపిణీ చేసేందుకు రూ.6,037 వంతున 215 లైట్లకు రూ.12,97,955గా టెండర్లు పిలిచారు. రిటైల్ మార్కెట్లో వీటి ధరలపై ‘సాక్షి’ రిటైల్ మార్కెట్‌లో ఆరా తీయగా మొదటిరకం లైటు ఒక్కోటీ రూ.1050కు పంపిణీ చేసేందుకు కొటేషన్ ఇచ్చారు. రెండవ రకం 150 వాట్ల బిగింపులు, అన్ని పన్నులు కలిపి రూ.3,500కు పంపిణీ చేసేందుకు సంసిద్ధతవ్యక్తం చేశారు. అయితే అధికారులు మార్కెట్ రేటు కన్నా 36 వాట్ లైట్లపై 30 శాతం, 150 వాట్ లైట్లపై 44 శాతం అధికధరలతో టెండర్‌లు పిలిచి, పైకి మాత్రం ఓ కాంట్రాక్టరు 23 శాతం తక్కువకు కోట్ చేశారని చూపిస్తూ సరుకు తెప్పించారు.

 

 గోదాముల్లోనే మగ్గుతున్న లైట్లు

 తెప్పించిన లైట్లను మూడు నెలల నుంచి అధికారులు గోదాముల్లో భద్రంగా ఉంచారే తప్ప బిగించే విషయంలో మాత్రం చొరవ చూపడం లేదు. దీనిపై అధికారులను ఆరా తీయగా వీటిని బిగించేందుకు లాడర్ వాహనం (లైట్లు బిగించేందుకు వీలుగా క్రేన్ బిగించిన వాహనం) లేదని, దాన్ని కొనేందుకు ప్రతిపాదిస్తున్నామని చెబుతున్నారు. రూ.20 లక్షల విలువైన ఈ వాహనాన్ని కౌన్సిల్ తీర్మానంతో తెప్పించాలని చూస్తున్నారు. ఇప్పటికే బిగించి ఉన్న ఎల్‌ఈడీ లైట్లు తొలగించి వాటి స్థానంలో రెట్టింపు విద్యుత్తు వినియోగం అయ్యే లైట్లను నగపాలక సంస్థ బిగించేందుకు ప్రయత్నం చేస్తోంది. నగరంలోని వెలగని వీధిలైట్ల స్థానంలో మళ్లీ ఎల్‌ఈడీ లైట్లనే బిగించాలని జనం కోరుతున్నారు. అయితే వాటిని పక్కన బెట్టి కమీషన్లు మిగుల్చుకునేందుకు విద్యుత్ ఎక్కువ వినియోగించే సాంప్రదాయక లైట్లను అదీ.. అధికధరలకు అమర్చనుండడం.. తద్వారా వృథా అయ్యే ప్రజాధనంలో కొంత కాంట్రాక్టర్లు, కొంత అధికారులు దండుకోవడానికేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top