నీరుగార్చారు..!

నీరుగార్చారు..! - Sakshi


రెండు జిల్లాల సమస్యలపై కేవలం 3 గంటలే చర్చ

సాగు, తాగునీటి విడుదలపై

 స్పష్టత ఇవ్వని జిల్లా అధికారులు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నిలదీత

మధ్యలోనే ఎంపీ ఎస్పీవై రెడ్డి నిష్ర్కమణ

రైతులకు నిరాశను మిగిల్చిన ఐఏబీ సమావేశం


సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టాల్సిన సమావేశం.. నిరాశను మిగిల్చింది. రెండు జిల్లాల పరిధిలోని ప్రాజెక్టులు, సాగునీటి కాలువలు, లక్షలాది ఎకరాల ఆయకట్టుపై చర్చించాల్సిన సమావేశం కేవలం మూడు గంటలే కొనసాగింది. అందులోనూ ఏ విషయాన్ని తేల్చకుండానే ముగిసింది. రెండు జిల్లాల నీటి వాటా ఎంత? ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. కర్నూలు కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది.



ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు కాలువలకు నీరందలేదని కర్నూలు, కడప జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల తర ఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వ తీరును వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అంతేకాని ప్రజలకు సాగు, తాగు నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామనే ఆలోచన కనిపించలేదు. సాగు నీటి సమస్యలపై వెఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి నిలదీస్తుండటంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమాధానం చెప్పలేక సమావేశం మధ్యలోనే నిష్ర్కమించారు.



ఓ అధికారి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తాను తెలియక మాట్లాడానని క్షమించమని అడగటం ఐఏబీపై అధికారులకు ఉన్న అవగాహనను స్పష్టం చేస్తోందని సభ్యులు చర్చించుకున్నారు. భూమా నాగిరెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు తడబడ్డారు.  ఈ సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షత వహించారు. ఇందులో కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, టీడీపీ ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఛీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

 

ఉప ముఖ్యమంత్రి గైర్హాజరు!

రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి సారిగా నిర్వహించిన కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల నీటి పారుదల సలహా మండలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరుకాలేదు.  సమావేశానికి ఉప ముఖ్యమంత్రి వస్తారని రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, సాగునీటి సలహా మండలి సభ్యులు, అధికారులు హాజరయ్యారు. అయితే ఉపముఖ్యమంత్రి రాకపోవటంతో వారందరూ నిరుత్సాహానికి గురయ్యారు. రెండు జిల్లాల ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి రాకపోతే తమ గోడు వినేవారెవరని, సమస్యలను తామెవరికి చెప్పుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు.



గత సమావేశాల్లో చేసిన తీర్మానాలకు ఇప్పటికీ మోక్షం లభించలేదని, ఈ సమావేశంలో చేసే తీర్మానాలకు కూడా మోక్షం లభిస్తుందని తాము భావించటం లేదని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన మంత్రి లేనప్పుడు ఈ సమావేశం నిర్వహించడం ఎందుకని భూమా నాగిరెడ్డి ప్రశ్నించటంతో.. కలెక్టర్ విజయమోహన్ జోక్యం చేసుకుని చైర్మన్‌గా తాను ఉన్నానని, సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో సమావేశం కొనసాగింది.

 

ఎక్కడి పనులు అక్కడే..

కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర దిగువకాలువ మొదలు వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్, అనేక ఎత్తిపోతల పథకాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, రవీంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధి, ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి.. అధికారులు, అధికారపార్టీ నేతలను నిలదీశారు.



ఎల్లెల్సీలోని ఆంధ్రా వాటాకు కన్నడిగులు గండికొడుతున్నారని.. రాజోలి బండ వద్ద ఆనకట్ట ఎత్తు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో దీనిపై చర్చించాలని ఎంపీ ఎస్పీవై రెడ్డికి సూచించారు. జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయని పలువురు ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుంకేసుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు 1.2 టీఎంసీలని చెప్పి 1.5 టీఎంసీలను తీసుకెళ్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.



వరదల నుంచి కర్నూలు ప్రజలను కాపాడేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.244 కోట్లు మంజూరు చేస్తే ఆ పనులకు ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఫేజ్-1, ఫేజ్-2 రద్దు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిందాల్, ప్రియా సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్యాల వైఖరిపై డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి నిరసన వ్యక్తంచేశారు. వీరికి సభ్యులందరూ సంఘీభావం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top