దేశ రాజకీయాల్లో నేనే సీనియర్‌

దేశ రాజకీయాల్లో నేనే సీనియర్‌ - Sakshi


ముఖ్యమంత్రి చంద్రబాబు



చిత్తూరు: దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ను తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాల్లో చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు. తొమ్మిదిన్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. ఇపుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు దేశంలో ఎవరూ లేరన్నారు. గురువారం ఆయన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో కొనసాగుతున్నానని పునరుద్ఘాటించారు. ‘రాష్ట్రం విడిపోయాక నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాట పట్టించేందుకు బస్సు నుంచే పరిపాలన చేశాను. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం నిరాదరణకు గురైంద’ని చెప్పుకొచ్చారు.



ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన..

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎలాంటి హామీలు ఇవ్వలేనంటూనే కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. ఇంటింటికీ మినరల్‌ వాటర్‌ అందిస్తానని, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే కుప్పంలో ప్రపంచ స్థాయి కమర్షియల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తానని చెప్పారు.కుప్పంలో నిరుద్యోగం లేకుండా చేసేందుకు ఇప్పటికే బ్రిటానియా లాంటి కంపెనీలు వచ్చాయని, మరిన్ని కంపెనీలు వచ్చేలా పారిశ్రామికవేత్తలతో సంప్రదిస్తున్నామన్నారు.



మంత్రులపై చంద్రబాబు ఫైర్‌?

తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీలో నిలపడంలో అలసత్వం వహిస్తుండటంపై మంత్రులు నారాయణ, సిద్ధారాఘవరావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ముఖ్యమంత్రి.. మంత్రి నారాయణ, సిద్దారాఘవరావులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై మాట్లాడినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top