నాది హత్యల చరిత్ర కాదు

నాది హత్యల చరిత్ర కాదు - Sakshi


అసెంబ్లీ లాబీలో మీడియాతో  ఏపీ సీఎం చంద్రబాబు

 

హైదరాబాద్: హత్యా రాజకీయాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.మంగళవారం శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్‌లో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ చరిత్రలో హత్యలు చేయించిన దాఖలాలు లేవన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, చట్టం అందరికీ సమానమేనని అన్నారు. శాసన సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సభా మర్యాదలు తెలుసుకోవాలని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదని అన్నారు.  వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊళ్లలో సగం మంది చనిపోయే వారని, అందుకే ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు తమకు సభలో మాట్లాడేందుకు కూడా అప్పటి ప్రభుత్వం అవకాశమివ్వలేదని చెప్పారు.



రవి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు జైళ్లలో చనిపోయారని, ఆ అంశంపై జగన్ స్పందించాలని అన్నారు. చట్ట ప్రకారం ఏ చర్చకైనా తాము సిద్ధమేనన్నారు. సభలో చట్టం, నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉంటాయన్నారు. జగన్ అవినీతికి పాల్పడ్డారని కోర్టులు వ్యాఖ్యానించాయని, ఆ కోర్టులపై పరువు నష్టం దావా వేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్  సీపీ నేతలకు అధికారం దక్కితే టీటీడీనీ కూడా కబ్జా చేసేవారని ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని, జగన్ మాత్రం స్పందించలేదని అన్నారు.



ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తున్నారు



ప్రజాస్వామ్య విలువలు కాలరాసే విధంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారని, శాసనసభ నియమావళి వారికి సరిగా తెలియదంటూ రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పి. నారాయణ, పీతల సుజాత, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మూకుమ్మడి దాడి చేశారు. సభ వాయిదా పడ్డాక సీఎం చంద్రబాబు సూచనలతో మీడియా పాయింట్ వద్ద వీరంతా విలేకరులతో మాట్లాడారు. వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమ, వల్లభనేని వంశీ, బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమారరాజు, సత్యనారాయణ సభను సజావుగా నడిపేందుకు  వైఎస్సార్ సీపీ సహకరించడం లేదని ఆరోపించారు. శాంతిభద్రతలపై చర్చించే హక్కు జగన్‌కు లేదని సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఏడు మిషన్లు, శ్వేతపత్రాలపై ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తుంటే సభను అడ్డుకుని బాబుకు మంచిపేరు రాకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభను గుప్పిట్లో పెట్టుకునేందుకు జగన్ యత్నిస్తున్నారని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. అసెంబ్లీ ఇడుపులపాయో.. పులివెందులో..కాదనే విషయం గుర్తించాలన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హత్యలపై స్పష్టత ఇవ్వడం లేదని, వివరాలు ఉంటే ఇవ్వాలని మరో మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.



వైఎస్ నేరచరిత్రపై జాతీయ పత్రికలు కథనాలు రాశాయని, హత్యా రాజకీయాలపై చర్చించే అర్హత జగన్‌కు లేదని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. తన వెనుక ఎంత మంది నేరచరితులున్నారో జగన్ తెలుసుకోవాలన్నారు. సభలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా డిమాండ్ చేశారు. తమకు అన్యాయం జరిగిందని భావిస్తే నిరసన తెలియ చేయాలని, సభను అడ్డుకోవడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార రాజు, సత్యనారాయణలు చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top