నేను లీడర్‌ను మాత్రమే..

నేను లీడర్‌ను మాత్రమే.. - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ:  ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. నా విజయం వెనుక ఐఏఎస్‌ల పాత్ర ఎంతో ఉంది. నేను లీడర్‌ను మాత్రమే. నేనిచ్చే ఆదేశాలను అమలు చేయడం, పర్యవేక్షించడం అంతా ఐఏఎస్‌లు చేశారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి అకాడమీ ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో మంగళవారం ‘గ్లోబలైజ్ వరల్డ్’ అంశంపై చంద్రబాబు మాట్లాడారు. బహిరంగసభల్లో ప్రసంగాలు చేసే తనకు శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ల ముందు మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు చేశానన్నారు.



సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి తామిచ్చిన విధానపరమైన నిర్ణయాలను అధికారులు అమలు చేయడం వల్లనే ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ ఆర్థికలోటును ఎదుర్కొంటోందని, సహజ వనరుల సాయంతో ఏపీని అభివృద్ధి చేస్తానని చెప్పారు. తమ రాష్ట్ర అభివృద్ధికి సూచనలు, సలహాలిస్తే అమలు చేస్తామని చెప్పారు.

మరిన్ని నిధులు తెండి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, నీటిపారుదల, రోడ్ల అభివృద్ధి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఏపీభవన్ గురజాడ సమావేశ మందిరంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడు తోట నర్సింహం, పార్టీ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీలు కంభంపాటి, గోకరాజు గంగరాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత పాల్గొన్నారు. కాగా, ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఎంపీలు ఎవరూ ఉండరాదని చంద్రబాబు ఆదేశించారు. ఎంపీలుగా ఉన్న వారు కేంద్రంనుంచి నిధులు రాబట్టే పనుల్లో శ్రద్ధ చూపాలని, ఇలాంటి పదవుల్లో ఉండడం తగదని సూచించారు. చంద్రబాబు ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్‌లతో దాదాపు అరగంట సమావేశమయ్యారు. పార్టీ పరువు బజారున పడిందని మండిపడ్డారు. ఇద్దరూ కాకుండా వేరొకరికి ఛాన్స్ ఇద్దామని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top