భార్యలకు పాద పూజలు చేసిన భర్తలు


రాజమండ్రి : ప్రవాస భారతీయుడు కరుణామయ స్థాపించిన 'సౌందర్యలహరి' సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సుమారు వందమంది భర్తలు తమ భార్యలకు షోడశోపచారాలతో ఖడ్గమాట పారాయణ చేస్తూ బుధవారం పత్ని పూజలు చేశారు. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా టీటీడీ కల్యాణ మండలంలో వీటిని నిర్వహించారు.



భార్యల పాదాల వద్ద కుంకుమతో పూజిస్తూ మెడకు గంధం రాశారు. శాక్తేయ సంప్రదాయంలో భర్తలు తమ భార్యలను పూజించే విధానం ఉందని కరుణామయి తెలిపారు. శ్రీరామకృష్ణ పరమహంస కూడా ఆయన అర్థాంగి శారదాదేవిని పూజించారని చెప్పారు. లలితా సహస్రనామాల్లో 'శివా, స్వాధీన వల్లభా', శివకామేశ్వరాంకస్థా' వంటి నామాలు పురుషునిపై శక్తి ఆధిక్యాన్ని సూచిస్తాయన్నారు. భార్యను పూజించడం సంప్రదాయానికి వ్యతిరేకం కాదన్నారు.



భార్యలోని వివిధ అంశాలను భర్త అవగాహన చేసుకోవడమే సాధన అన్నారు. అజ్ఞాతవాస సమయంలో ధర్మరాజు తమ్ముళ్లతో ద్రౌపది గురించి చెబుతూ 'ఈమె మనకు ప్రియమైన ఇల్లాలు, తల్లి వలె పూజించదగినది, అక్కవలె మన్నింపదగినది' అని చెప్పినట్లు వ్యాస భారతంలో ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top