అనుమానం పెనుభూతమై..


- మాడుగులలో భార్యను చంపిన భర్త

- జమ్మలమడకలో కొడవలితో భార్య గొంతు కోసిన భర్త

- తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు



అనుమానం రెండు సంసారాల్లో చిచ్చుపెట్టింది. భార్యను శంకించి ఒకరేమో కొడవలితో గొంతు కోశాడు. ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ప్రబుద్ధుడు సుత్తితో భార్య తలపై మోది హత్య చేశాడు. ఈ రెండు ఘటనలు పల్నాడులోని మాచర్ల, గురజాల మండలాల్లో జరిగాయి. బాధితులు ఇద్దరూ గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన ఆడపడుచు, కోడలు కావడం విషాదకరం.

 

గురజాల: అనుమానంతో భార్యను కడతేర్చిన ఘటన మండలంలోని మాడుగులలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురజాలకు చెందిన చిటిమాల మల్లమ్మ(38)కు మాడుగుల గ్రామానికి చెందిన పగిడిపల్లి సుందరరావుతో 17 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లమ్మ మాడుగుల గ్రామంలో అంగడీవాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మల్లమ్మపై భర్త అనుమానం పెంచుకోవడంతో కుటుంబ కలహాలు పెరిగాయి. ఈ క్రమంలో ఏడాదిన్నరగా మల్లమ్మ పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ మాడుగులలో విధులు నిర్వర్తిస్తోంది. అనుమానంతో తన భర్త వేధిస్తున్నాడని గతంలో మల్లమ్మకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.



ఈ క్రమంలో గురువారం ఉదయం సుందరరావు మాడుగులలోని అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వెళ్లి.. మనస్పర్థలు మరిచి కలిసి ఉందామని మల్లమ్మకు నమ్మబలికాడు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఇంటిలోంచి మల్లమ్మ శవాన్ని బయట పడేసి, పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్‌హెచ్‌వో ఎం.రాజేష్‌కుమార్ సందర్శించి, వివరాలు సేకరించారు. మృతిరాలి తండ్రి చిటిమాల వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

 

జమ్మలమడకలో భార్య గొంతు కోసిన భర్త

మాచర్ల టౌన్: అనుమానంతో భార్య గొంతు కోసి, హతమార్చేందుకు ఓ ప్రబుద్ధుడు ప్రయత్నించిన ఘటన మండలంలోని జమ్మలమడక గ్రామంలో గురువారం జరిగింది. ఆస్పత్రిలో బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలేటి విక్రమ్‌కు గురజాల మండలం మాడుగులకు చెందిన సౌజన్యతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఇటీవల సౌజన్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న విక్రమ్ తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భార్యతో గొడవపడ్డాడు.



మాటమాట పెరగడంతో ఇంట్లో ఉన్న కొడవలితో సౌజన్య గొంతు కోసేందుకు విక్రమ్ యత్నించాడు. ఆమె ప్రతిఘటించి చేతులను అడ్డుపెట్టుకోవడంతో తెగాయి. చేతులు పక్కకు తీయగానే గొంతు కోశాడు. గొడవను గమనించి భయపడిన వారి కుమారుడు వినయ్‌కుమార్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో విక్రమ్ అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సౌజన్యను చికిత్స కోసం పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్‌ఐ సోమేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి సౌజన్య నుంచి వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top