ఆమె పేరు కుసుమ

ఆమె పేరు కుసుమ


 పైశాచిక భర్త!

 కట్నం దండిగా ఇచ్చినా అత్తవారింట ఆరళ్లు

 శాశ్వతంగా వదిలించుకోవాలని గదిలో నిర్బంధం

 పోలీసుల సాయంతో బయటపడ్డ గృహిణి


 

పలాస: ఆమె పేరు కుసుమ. కానీ వివాహమయ్యాక వసివాడింది. అత్తవారి ఆరళ్లతో అల్లాడిపోయింది. చివరకు భర్త తనను గదిలో నిర్బంధించంతో విషయం పోలీసులకు తెలిసింది. ఇదంతా ఏదో అనాగరిక సమాజంలో జరిగిందనుకుటే పొరపాటే. విదేశంలో ఉద్యోగంచేస్తూ... దండిగా కట్నం పుచ్చుకుని... ఇప్పుడు వదిలించుకునేందుకు జరుగుతున్న చిత్రహింసల్లో భాగమే. పోలీసులు ఆమెను విడిపించగా తాను ఇన్నాళ్లు ఎదుర్కొంటున్నబాధలను ఆమె కన్నీటితో పోలీసులకు, విలేకరులకు తెలిపింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ కె.టి.రోడ్డులో విశ్వజ్యోతి మెడికల్ స్టోర్ యజమాని శాశనపురి విశ్వేశ్వరరావు కుమార్తె కుసుమను తాళ్ళబద్ర వద్ద గల రైస్ మిల్లు యజమాని తంగుడు భాస్కరరావు కుమారుడు కృష్ణచైతన్యకిచ్చి 2012 ఫిబ్రవరి నెలలో పెళ్లి జరిపించారు.

 

వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు కట్నంగా ఇవ్వడమేగాకుండా, పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు లాంఛనంగా ఇచ్చినట్టు కుసుమ తల్లిదండ్రులు చెబుతున్నారు. వివాహమైన కొద్ది రోజులకే కృష్ణచైతన్య నారాయణదొర కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న అత్తవారింట ఆమెను విడిచిపెట్టి ఉద్యోగ రీత్యా లండన్ వెళ్ళిపోయాడు. వివాహం చేసుకుని తనతో తీసుకెళ్ళకుండా విడిచిపెట్టి వెళ్లడంపై ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను లండన్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. తనకున్న వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని కొద్ది రోజుల్లోనే తిరిగి కాశీబుగ్గ తీసుకొచ్చి తన తల్లిదండ్రులవద్ద దింపేసి వెళ్లిపోయాడు. ఇక అత్తమామలూ తనకు సూటిపోటి మాటలతో మనిసిక క్షభకు గురిచేశాడు.

 

ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆలోచనతో ఇప్పటి వరకు భరిస్తే. ఇటీవల తమ్ముడి వివాహానికి వచ్చిన కృష్ణచైతన్య తల్లిదండ్రులతో కలసి హింసించాడు. భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టాడు. దీనిపై కాశీబుగ్గ పోలీసుల వద్ద, కుల పెద్దలకు ఫిర్యాదు చేయగా తన భర్తతో పాటు అత్తమామలకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికి వారిలో మార్పు రాలేదు. చివరకు ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో మంగళవాం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటిలో బంధించి బయట తాళం వేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చి ఆమె పరిస్థితి చూసి మహిళా సంఘాలకు తెలియజేయగా వారు వచ్చేసరికి కుసుమ అత్తమామలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కాశీబుగ్గ పోలీసులకు విషయం తెలియజేయడంతో ఎస్‌ఐ ఆర్.వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో పెట్టి నిర్బంధించడం చట్టరీత్యా నేరమని, తలుపులు తీయాలని కుసుమ మామ భాస్కరరావును ఎస్‌ఐ హెచ్చరించడంతో వెంటనే వచ్చి తలుపులు తీశారు.

 

గది నుంచి బయటకు వచ్చిన కుసుమ తన తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తన కుమార్తెకు న్యాయం చేయాలని కుసుమ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తన కుమార్తె సంతోషంగా జీవిస్తుందనే ఆశతో ఎన్‌ఆర్‌ఐ సంబంధం చేశామని, పెద్దగా చదువులేదనే కుంటి సాకుతో తన కుమార్తెను వదిలించుకోవడానికి చూస్తున్నారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top