భర్త నుంచి రక్షించండి: మహిళ ఉన్నతాధికారి

పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిర్మల


విశాఖపట్నం : తననూ, పిల్లలను వదిలేయడమేగాక ఇప్పుడు చంపేస్తానంటూ బెదిరిస్తున్న తన భర్త నుంచి రక్షణ కల్పించాలని ఓ వివాహిత పోలీసులను వేడుకున్నారు. అయితే ఆమె సాధారణ మహిళ కాదు... రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థాయి సర్వీసుకు చెందిన గ్రూప్-1 అధికారి. ఆమె పేరు నిర్మలమ్మ (నిర్మల). విజయనగరం జిల్లా పార్వతీపురం ఆమె స్వస్థలం. 2009 గ్రూప్-1 పోటీపరీక్షల్లో మహిళల్లో రెండో ర్యాంకరుగా నిలిచి ఎంపీడీఓగా ఎంపికై,  ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లో నియమితులయ్యూరు. ఆ బాధ్యతలు స్వీకరించిన కొద్దినెలలకే అదే జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు డేగల శ్రీనివాసరావుతో ఆమెకు వివాహమైంది. రెండేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగినా తర్వాత మనస్పర్థలు మొదలయ్యాయి.

 

 ప్రస్తుతం డెప్యుటేషన్‌పై విశాఖ జిల్లా డీఈఓ కార్యాలయంలో ఫైనాన్సియల్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న నిర్మల... గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా భర్త ఆయుర్వేద వైద్య వృత్తిని వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. అక్కడి నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. నన్ను, పిల్లలను పట్టించుకోలేదు. ఇటీవలి నుంచే వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రోజూ మానసికంగా, శారీరకంగా అతను పెట్టే హింస భరించలేకే 2011లో 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టా. పోలీసులిచ్చిన కౌన్సెలింగ్ తో రాజీకి వచ్చాడు. ఈ మార్పు రెండు నెలలే. మళ్లీ చిత్రహింసలు మొదలయ్యాయి. మళ్లీ గత ఏడాది కేసు పెట్టా. ఇప్పుడు నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. పోలీసులు స్పందించి మాకు రక్షణ కల్పించాలి...’’ అని నిర్మల కన్నీరుమున్నీరయ్యారు. ఈ సమావేశంలో ఆమె తల్లిదండ్రులు జి.వెంకటయ్య, పైడమ్మ ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top